ముంబై, జూలై 15 : యూనియన్ బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభంలో 27.5 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,427.94 కోట్లుగా ఉన్న నికర లాభం.. ఈసారికిగాను రూ.5,641.52 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
మార్జిన్లు అధికంగా నమోదుకావడంతోపాటు వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం కూడా లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదుకు దోహదం చేసిందని బ్యాంక్ ఎండీ, సీఈవో ఆశీష్ పాండే తెలిపారు. ప్రవాస భారతీయుల నుంచి డిపాజిట్లను సేకరించడానికి ప్రత్యేకంగా శాఖలను ఏర్పాటు చేస్తున్నట్టు, ఇందుకోసం 20 శాఖలను గుర్తించినట్టు ఆయన చెప్పారు.సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.65 శాతం నుంచి 0.87 శాతానికి దిగొచ్చినట్టు పేర్కొంది.