అర్లింగ్టన్ (టెక్సాస్) : ఫిఫా ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిన ఫ్రాన్స్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టోర్నీలో రెండు అత్యంత బలమైన జట్ల మధ్య జరిగిన కీలకపోరులో గత ఎడిషన్ రన్నరప్‌పై మాజీ చాంపియన్ స్పెయిన్‌దే పైచేయి అయింది. ఇరుజట్ల నడుమ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున డల్లాస్ స్టేడియంలో జరిగిన పోరులో స్పెయిన్.. 2-0తో ఫ్రాన్స్‌ను ఓడించి 16 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరి ట్రోఫీని దక్కించుకోవాలనే లక్ష్యంతో దిగిన ఎంబాపె సేనకు చెక్ పెడుతూ మికేల్ ఓయర్జబల్ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ) చెరో గోల్‌తో స్పెయిన్‌ను 2010 తర్వాత తొలిసారి ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. టైటిల్ పోరులో స్పెయిన్.. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఈనెల 20న అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇదే పోరులో ఓడిన జట్టుతో మూడో స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్స్ తలపడనుంది.
తొలి సగం మ్యాచ్‌ను తమ నియంత్రణలోనే ఉంచుకున్న స్పెయిన్.. సెకండాఫ్‌లోనూ అదే జోష్‌లో ఆడింది. బంతిపై నియంత్రణ కోసం ఇరుజట్ల మిడ్‌ఫీల్డర్లు వీరోచితంగా పోరాడారు. స్పెయిన్ తరఫున రొడ్రి, పెడ్రి, ఒల్మొ బంతిని తమ కంట్రోల్లో ఉంచుకుంటూనే సహచరులకు పాస్‌లు అందిస్తూ ప్రత్యర్థిపై పదేపదే దాడులకు దిగి పటిష్టమైన ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించారు. 58వ నిమిషంలో ఒల్మో పాస్‌ను అందుకున్న పోరో.. ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తాకొట్టిస్తూ బాక్స్ సమీపం నుంచి గోల్ కొట్టి స్పెయిన్‌ను 2-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత పోరు ఏకపక్షమే అయింది. 2010 చాంపియన్ స్వేచ్ఛగా ఆడగా ఎంబాపె సేన మాత్రం ఒత్తిడిలోకి కూరుకుపోయి పేలవ ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. గోల్స్ కోసం ఎంతగా యత్నించినా స్పెయిన్ డిఫెన్స్‌కు తోడు సైమన్ కట్టిన గోడను బద్దలుకొట్టలేకపోయింది.

బలాబలాల పరంగా చూస్తే పేపర్‌పై ఇరు జట్లూ సమఉజ్జీలుగానే కనిపించినా టోర్నీలో ఫ్రెంచ్ ఎటాకింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకోవడంలో స్పెయిన్ వందకు రెండు వందల శాతం విజయవంతమైంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావించినా ఫీల్డ్‌లో ఆ భావనేమీ కనిపించలేదు. స్టార్ స్ట్రైకర్ ఎంబాపెతో పాటు ఉస్మాన్ డెంబెలె, మైకేల్ ఒలిస్ను అడ్డుకోవడమే కాదు.. వారికి బంతిపై పట్టు చిక్కకుండా చేయడంలో స్పెయిన్ రక్షణశ్రేణి సక్సెస్ అయింది. ఈ మెగా టోర్నీ ఆసాంతం దాదాపు మ్యాచ్‌కు ఒక్కటైనా గోల్ చేసి గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానాన నిలిచిన కెప్టెన్ ఎంబాపె.. సెమీస్‌లో మాత్రం తన ప్రభావం చూపించలేకపోయాడు. ఆట ఆరంభం నుంచే బంతిని తమ ఆధిపత్యంలోకి తీసుకోడానికి రెండు జట్లు తీవ్రంగా యత్నించినా స్పెయిన్ మిడ్‌ఫీల్డర్లు మాత్రం ప్రత్యర్థి ప్లేయర్లు తమ గోల్‌పోస్ట్ సమీపంలోకి రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారు.

టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్కటంటే ఒకే గోల్ ఇచ్చుకున్న ఆ జట్టు.. ఫ్రాన్స్‌నూ సమర్థవం తంగా అడ్డుకుంది. ఆట 22వ నిమిషంలో యమాల్‌కు లుకాస్ డిగ్నె అడ్డు తగలడంతో లభించిన పెనాల్టీని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. ఓయర్జబల్.. పెనాల్టీని గోల్‌గా మలిచి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ మరింత ధాటిగా కౌంటర్ ఎటాక్‌కు దిగినా స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఒకవైపు ఎంబాపె, మరోవైపు డెంబెలె ఉన్నా వారి చెంతకు బంతి వచ్చింది తక్కువే. వాటిని కూడా గోల్స్‌గా మలచడంలో ఈ స్టార్ స్ట్రైయికర్లు విఫలమయ్యారు. డెంబెలె 32వ నిమిషంలో తనకు లభించిన ఫ్రీకిక్‌ను స్పెయిన్ గోల్‌కీపర్ సైమన్ అడ్డుకోగా కొద్దిసేపటికే ఎంబాపె గోల్ కొట్టేందుకు యత్నించినా అతడికీ నిరాశే ఎదురైంది. దీంతో తొలి 45 ని.కు తోడు స్టాపేజ్ టైమ్‌లోనూ ఫ్రాన్స్ గోల్స్ లేకుండానే బ్రేక్‌కు వెళ్లింది.