ముంబై, మే 2: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.581.24 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.312.18 కోట్లతో పోలిస్తే 86.2 శాతం పెరిగినట్టు బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం 7.89 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికంనాటికి 4.78 శాతానికి దిగొచ్చాయి.అలాగే నికర ఎన్పీఏ 2.7 శాతం నుంచి 1.29 శాతానికి తగ్గాయి. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.1,862.34 కోట్ల నికర లాభాన్ని గడించింది. బ్యాంక్ చరిత్రలో ఒక ఏడాది ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇది రూ.929.76 కోట్లుగా ఉన్నది. నికర వడ్డీ ఆదాయం రూ.7,343.13 కోట్లకు చేరుకున్నది.