Uber | టెక్నాలజీ వల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా.. సిటీలోనే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాలన్నా క్యాబ్ సర్వీసులు రెడీ.. స్మార్ట్ ఫోన్లో క్యాబ్ సర్వీస్ సంస్థ యాప్‌లోకి వెళ్లి బుక్ చేసుకుంటే.. మన ఇంటి వద్దకే కారు లేదా.. ఆటో క్యాబ్ వచ్చేస్తుంది. నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తుంది. కానీ, యూజర్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉంటే ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నదట ఉబెర్.. ఈ సంగతి బెల్జియం వార్తా సంస్థ డెర్నియర్ హ్యూరే బయట పెట్టింది.
క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకున్న వ్యక్తి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉందనుకోండి.. క్యాబ్ చార్జి కంటే ఆరు శాతం ఎక్కువ వసూలు చేస్తుందని తమ పరిశోధనలో తేలిందని డెర్నియర్ హ్యూరే తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతం నుంచి రెండు వేర్వేరు ఉబెర్ క్యాబ్‌లు బుక్ చేశారు. ఒకరి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ 12 శాతం, మరొకరి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ 84 శాతం ఉంది. రైడ్ పూర్తయిన నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న తర్వాత 84శాతం బ్యాటరీ చార్జింగ్ ఉన్న వ్యక్తి వద్ద 16.6 యూరోలు, 12 శాతం బ్యాటరీ చార్జింగ్ గల వ్యక్తి నుంచి 17.56 యూరోలు వసూలు చేశారు ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు. ఒకసారి ఐ-ఫోన్, మరొకసారి ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఉబెర్ క్యాబ్‌లు బుక్ చేసినప్పుడు ఇదే తేడా వచ్చిందని ఆ వార్తా సంస్థ వెల్లడించింది.
డెర్నియర్ హ్యూరే ఆరోపణలను ఉబెర్ తోసిపుచ్చింది. యూజర్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉందో తెలుసుకోవడం తమకు అసాధ్యం అని వ్యాఖ్యానించింది. ధరల్లో తేడాలకు రైడ్ బుకింగ్ టైం, సంబంధిత డ్రైవర్ డిమాండ్‌ను బట్టి ఉంటుందని తెలిపింది. కానీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఆధారంగా చార్జీ వసూలు చేయబోమని చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఉబెర్‌పై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి.
ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు క్యాబ్ రైడర్లు ఎక్కువ చార్జీ చెల్లించడానికి సుముఖం అని 2016లో ఉబెర్ ఫైనాన్స్ వ్యవహారాల అధిపతి కేత్ చెన్ చెప్పారు. కానీ బ్యాటరీ చార్జింగ్ ఆధారంగా రైడ్ చార్జి వసూలు చేయట్లేదని అప్పుడు కూడా ఉబెర్ వివరణ ఇచ్చింది. డేర్ నియర్ హ్యూరే ఆరోపణలపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఉబెర్ ధరలు, విధి విధానాలపై అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.