Two Wheelers – Tax Rationalisation | ప్రస్తుతం ప్రతిక్షణం విలువైన నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరం.. దేశీయ పరిస్థితుల నేపధ్యంలో టూ వీలర్స్‌ను లగ్జరీ వస్తువుల మాదిరిగా చూడొద్దని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథూర్ చెప్పారు. అందుబాటు ధర కారణంగా వచ్చే ఏడాది (2025-26)లో ద్విచక్ర వాహనాల విక్రయాలు సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల తప్పనిసరి అవసరాల రీత్యా ద్విచక్ర వాహనాలపై పన్నులను తగ్గించాలని కోరారు.
మధ్య తరగతి ప్రజలు తమ ఖర్చులను పెంచుకునేందుకు ఆదాయం పన్నులను హేతుబద్ధీకరించాలని యోగేశ్ మాథూర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత నేపధ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోటార్ సైకిళ్ల విక్రయాలు ఆశాజనకంగా లేకున్నా, స్కూటర్ల విక్రయాల్లో సానుకూల ధోరణి నెలకొందన్నారు. ప్రజల తప్పనిసరి ప్రయాణ వస్తువుగా మారిన ద్విచక్ర వాహనాలను లగ్జరీ వస్తువులుగా పరిగణించకుండా జీఎస్టీ హేతుబద్ధీకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థ విస్తరించలేదని గుర్తు చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వసతుల్లేవన్నారు. పట్టణ ప్రాంతాలు జనం రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయన్నారు.
ఈ పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు తప్పనిసరి అని యోగేశ్ మాథూర్ పేర్కొన్నారు. వాటిపై 28 శాతం పన్ను విధించడం సబబు కాదని చెప్పారు. ఇది తమ విజ్ఞప్తి మాత్రమేనన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 350సీసీ పై చిలుకు సామర్థ్యం గల ఇంజిన్ మోటారు సైకిళ్లపై కస్టమర్లు అదనంగా మూడు శాతం పన్నుతో మొత్తం 31 శాతం పన్ను చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు 4జీ నుంచి 6జీకి మారాయన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఓబీడీ 2ఏ నుంచి ఓబీడీ2బీ నిబంధనలు అమలు ప్రారంభం కానుండటంతో ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులపై భారం పడుతుందన్నారు.
సాధారణ ఎన్నికలకు తోడు, తొలి త్రైమాసికంలో పెండ్లిండ్లు లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల విక్రయం 12 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు యోగేశ్ మాథూర్ తెలిపారు. సాధారణ ఎన్నికల వల్ల మోటారు సైకిళ్ల విక్రయాలపై ప్రభావం పడిందన్నారు. దీపావళి సీజన్లోనే అధిక విక్రయాలు జరిగాయన్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ పెండ్లిండ్ల సీజన్ కొనసాగుతున్నందున సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.