Twitter on Elon Musk | మైక్రో బ్లాగింగ్ సైట్.. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్.. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సొంతం కాబోతుందా.. అంటే తొలుత ఎలన్‌మస్క్ ఆఫర్‌ను తోసిపుచ్చిన ట్విట్టర్.. తాజాగా మనస్సు మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. 54.20 డాలర్ల షేర్ ధర `బెస్ట్ అండ్ ఫైనల్` అని ట్విట్టర్ వర్గాలు అంటున్నట్లు సమాచారం. 43 బిలియన్ల డాలర్లకు సంస్థ విక్రయ డీల్‌పై సోమవారం పొద్దుపోయిన తర్వాత ట్విట్టర్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. వాటాదారుల నిర్ణయానికి వదిలేయొచ్చునని తెలుస్తున్నది. అయితే ఏదేనీ కారణం వల్ల చివరిక్షణంలో ఈ డీల్ కుప్ప కూలవచ్చునన్న అనుమానాలు ఉన్నాయి.
తొలుత ఎలన్‌మస్క్‌కు విక్రయించడానికి ట్విట్టర్ ససేమిరా అంది.. కానీ మస్క్.. ఈ సోషల్ మీడియా వేదికను సొంతం చేసుకునేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్ డాలర్ల రుణం తీసుకోవడానికి ప్లాన్ చేశారు. ట్విట్టర్‌ను సులభంగా కొనుగోలు చేయడానికి ఏకంగా ఒక హోల్డింగ్ కంపెనీనే రిజిస్టర్ చేశారు కూడా. డీల్ ఆకర్షణీయంగా ఉంటే.. దానిపై ట్విట్టర్ బోర్డు, వాటాదారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఎలన్‌మస్క్‌తో చర్చలు మొదలవుతాయని తెలుస్తున్నది.
ఒకవేళ ట్విట్టర్ బోర్డు తన ఆఫర్‌ను తిరస్కరించినా.. దాన్ని సొంతం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. అందుకోసం వాటాదారులకు టెండర్ ఆఫర్ ఇవ్వ తలపెట్టారు. ఇప్పటికే కొందరు వాటాదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మస్క్ సంప్రదింపులు జరిపారని వినికిడి. ట్విట్టర్ వాక్స్వేచ్ఛకు నియంత్రణలు అడ్డుగోడలుగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తానని వారికి మస్క్ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో ట్విట్టర్ బోర్డు వ్యతిరేకించినా మస్క్‌తో భేటీ కావడానికి కొందరు వాటాదారులు ముందుకొచ్చారు. ఈ సంగతి పసిగట్టిన ట్విట్టర్ బోర్డు తానే సంస్థ విక్రయానికి మస్క్ ప్రతిపాదించిన డీల్‌పై సానుకూల వ్యాఖ్యలు చేసింది.