Blue check @ Twitter | బ్లూ చెక్ సర్వీసులను ట్విట్టర్ రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నది. సబ్స్క్రిప్షన్ పొందిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో రానున్నాయి. ఈ సేవలను పొందే వినియోగదారులు ఇకపై హెచ్డీ వీడియోలను కూడా అప్లోడ్ చేసేందుకు వీలు కల్పిస్తున్నది. ట్విట్టర్ అధికారిక హ్యాండిల్లో ఈ విషయాలను ప్రకటించారు.
బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లో భాగంగా ప్రభుత్వం, కంపెనీలు, సామాన్య ప్రజలకు వివిధ రంగుల బ్యాడ్జ్‌లను కేటాయించనున్నారు. కంపెనీలకు బంగారు రంగు, ప్రభుత్వాలకు గ్రే రంగు, సామాన్య పౌరులకు బ్లూ టిక్‌లు ఇవ్వనున్నారు. చెక్‌లు యాక్టివేట్ చేసే ముందు మాన్యువల్‌గా చెక్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వెబ్‌లో ట్విట్టర్ బ్లూ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ధర నెలకు 8 అమెరికన్ డాలర్లు. యాపిల్ సంస్థ విధించిన 30 శాతం పన్నుల కారణంగా ఐఓఎస్‌లో ఇది చాలా ఖరీదైనదిగా మారింది. యాపిల్ ఐఓఎస్‌లో కొనుగోలు చేసినట్లయితే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ పొందిన యూజర్లు కొన్ని కొత్త సేవలను కూడా పొందే ఏర్పాట్లు చేశారు.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ట్విట్లను ఎడిట్ చేసుకోవచ్చు. 1080పీ లో వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. రిప్లై, మెన్షన్, సెర్చ్‌లో వీరికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. సాధారణ వినియోగదారుల కంటే 50 శాతం తక్కువ ప్రకటనలు కనిపిస్తాయి. కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. సబ్స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫొటోను మార్చుకోవచ్చు. అయితే, ఇలా మార్పులు చేసినపక్షంలో వారి ఖాతాను తిరిగి సమీక్షించే వరకు బ్లూ చెక్ మార్క్ తాత్కాలికంగా తీసేస్తారు.