TVS veteran H Lakshmanan | సుందరం క్లాయ్టాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చెన్నై కేంద్రంగా పని చేస్తున్న టీవీఎస్ గ్రూప్ కీలక సభ్యుడు హెచ్ లక్ష్మణన్ (92) వయస్సు సంబంధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ శనివారం కన్నుమూశారు. ఏడు దశాబ్దాలుగా టీవీఎస్ గ్రూప్‌తో అనుబంధం కల లక్ష్మణన్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సన్నిహితులంతా హెచ్ఎల్ అని ముద్దుగా పిలుచుకునే వారు. టీవీఎస్ గ్రూప్‌లో కార్పొరేట్ కల్చర్ తీసుకురావడంలో అచంచల నైతిక విలువలు, వ్యూహాత్మక ప్రతిభ కనబరిచారాయన.
టీవీఎస్ మోటార్ ఫౌండర్ టీఎస్ శ్రీనివాసన్ (చీమా)తో సన్నిహితంగా 20 ఏండ్ల వయస్సు నుంచే పని చేస్తూ వచ్చారు. ఇద్దరూ కలిసి టీవీఎస్ మోటార్ గ్రూపును దేశంలోని అతిపెద్ద ఆటో కంపోనెంట్స్ కంపెనీగా తీర్చిదిద్దడంలోనూ, భవిష్యత్ వృద్ధికి పని చేశారు. అయితే టీఎస్ శ్రీనివాసన్ అకాల మరణంతో సుందరం క్లాయ్టాన్, టీవీఎస్ మోటార్ గ్రూప్‌కు టీ వేణు శ్రీనివాసన్ సారధ్యం వహించాల్సి వచ్చింది. ఈ తరుణంలో వేణు శ్రీనివాసన్‌కు కష్టసమయంలో లక్ష్మణ్ మార్గదర్శిగా నిలిచారు.
టీవీఎస్ మోటార్ గ్రూప్ మోపెడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్‌గా పరివర్తన చెందడంలో లక్ష్మణన్ సంప్రదింపులు, వ్యూహాత్మక ప్రణాళిక నైపుణ్యాలు కీలక భూమిక పోషించాయి. కోట్ల మందికి ఎన్బీఎఫ్సీ సేవలందించడం వెనుక లక్ష్మణన్ కృషి ఉంది. తన తండ్రి మరణం తర్వాత లక్ష్మణన్ నుంచి తను ఎంతో నేర్చుకున్నానని అవిశ్రాంతంగా పని చేసే వారని, ఆయన తనకు జిబ్రాల్టర్ రాక్ వంటి వారని పేర్కొన్నారు.