Celebi Aviation : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు అండగా నిలిచినందుకు టర్కీకి భారీ బుద్ధి చెప్పింది ఇండియా. ఆ దేశానికి సంబంధించిన ఏవియేషన్ సంస్థను నిషేధించడంతో ఆ సంస్థ ఒక్కరోజులోనే 500 మిలియన్ డాలర్లు నష్టపోయింది. ఈ విషయాన్ని తాజాగా ఆ సంస్థ చైర్పర్సన్ వెల్లడించారు. ఈ ఉదంతంలో నష్టపోయింది టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్ సంస్థ. బ్లూమ్‌బర్గ్ అనే మీడియా సంస్థతో సెలెబి ఏవియేషన్ సంస్థ చైర్పర్సన్ క్యానన్ సెలెబియోగ్లు మాట్లాడారు. భారత్ తీసుకున్న నిర్ణయంతో తమ సంస్థ ఎంతగా నష్టపోయిందో ఆమె వివరించారు. గత ఏడాది పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా ఇండియా గత మే నెలలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్‌పై నాలుగైదు రోజులపాటు ఇండియా దాడి చేసింది. దీంతో ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే, ఈ యుద్ధంలోకి దూరింది టర్కీ. అది కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన టర్కీ.. ఆ దేశానికి 350కి పైగా డ్రోన్లు పంపింది. అలాగే, యుద్ధ నౌక, ఒక యుద్ధ విమానాన్ని కూడా పంపించింది. తాము పాకిస్తాన్‌కు అండగా ఉంటామని టర్కీ బహిరంగంగా ప్రకటించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అప్పట్లో ఆ దేశంతో అనేక వాణిజ్య పరమైన ఆంక్షల్ని విధించింది. ఆ దేశానికి మన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్ని నిలిపివేసింది. అలాగే, ఆ దేశం నుంచి అనేక ఉత్పత్తుల దిగుమతుల్ని కూడా నిషేధించింది. ఇదే సమయంలో టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్‌పై కూడా నిషేధం విధించింది. సెలెబి ఏవియేషన్.. మన దేశంలో ఏవియేషన్ సంబంధిత సేవలు అందిస్తుంది. అంటే కార్గో విమానాలకు, ప్యాసింజర్లకు, కార్గో సేవలకు సంబంధించిన పనులు నిర్వహిస్తుంటుంది. దేశంలో ముంబై, ఢిల్లీ సహా పలు చోట్ల ఎయిర్‌పోర్టుల్లో ఈ సంస్థ సేవలు అందించేది.
ఎయిర్‌పోర్టులలో కార్గో వేర్‌హౌజ్, స్టోరేజ్, హ్యాండ్లింగ్ వంటి ఆపరేషన్స్ నిర్వహించేది. నేరుగా విమానాలు నడపకపోయినప్పటికీ వాటి సంబంధిత సేవల వ్యాపారం నిర్వహించేది. ఇండియాలోనే ఈ సంస్థకు అతిపెద్ద మార్కెట్ ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చినందుకు ఆగ్రహించిన ఇండియా.. సెలెబి ఏవియేషన్ సంస్థపై నిషేధం విధించింది. దేశ భద్రత రీత్యా ఈ సంస్థకు సెక్యూరిటీ అనుమతులు రద్దు చేసింది. తక్షణమే సేవల్ని ఉపసంహరించాలని సూచించింది. సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇతర సంస్థలకు బదలాయించింది. దీంతో ఈ సంస్థ సేవలు ఇండియాలో ఉన్నట్లుండి నిలిచిపోయాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా ఒక్క రోజులోనే 500 మిలియన్ డాలర్లు సంస్థ నష్టపోయింది. తాము దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్క రోజులోనే కూలిపోయిందని, 500 మిలియన్ డాలర్ల నుంచి సున్నాకు పడిపోయామని సంస్థ చైర్పర్సన్ క్యానన్ సెలెబియోగ్లు అన్నారు.
ఇండియా నిర్ణయం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. గత మే నెలలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. తమకు వ్యాపారం కన్నా, దేశ భద్రతే ముఖ్యమని కోర్టు తెలిపింది. తమకు, టర్కీ ప్రభుత్వానికి సంబంధం లేదని సెలెబి కంపెనీ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కోర్టు విచారణలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూతురుకు సెలెబి సంస్థలో వాటా ఉన్నట్లు కూడా తేలింది. దీంతో కేంద్రానికి అనుకూలంగా, సంస్థకు వ్యతిరేకంగా గత జూలైలో కోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి సంస్థ సేవలు దేశంలో నిలిచిపోయాయి. కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయంతో టర్కీ కంపెనీ నష్టాల బాటలో నడుస్తోంది.