ఫ్రాంక్ఫర్ట్(జర్మనీ), జూలై 12: యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతవుతున్న వస్తువులపై 30 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. దీంతో ఫ్రెంచ్, ఇటలీ, జర్మనీ, స్పానిష్ దేశాల నుంచి దిగుమతవుత్ను చీజ్, లెదర్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి.
ఈయూ దేశాలకు చెందిన ఉత్పత్తులపై 20 శాతం ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు ఏప్రిల్ నెలలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి క్రమంలో ఈ సుంకాన్ని 50 శాతానికి పెంచిన్న ట్రంప్..ఈసారి కాస్త కరుణించి 30 శాతానికి కుదించారు. ప్రతీకార సుంకాల విధింపుపై 27 మంది సభ్యులు కలిగిన ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడు దీనిపై ఆశావాదంతో ఉన్నారు.
అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు బదులుగా యూరోపియన్ దేశాలు కూడా అంతే స్థాయిలో పన్ను విధించడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న గొడ్డు మాంసం, వాహన విడిభాగాలు, బీర్లు, బోయింగ్ విమానాల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలు సైతం అధికంకానున్నాయి.
ప్రస్తుతం యూరోపియన్-అమెరికా దేశాల మధ్య 2024లో 1.7 ట్రిలియన్ యూరోలు(2 ట్రిలియన్ డాలర్లు) మేర వాణిజ్యం జరిగింది. సరాసరిగా రోజుకు 4.6 బిలియన్ యూరోల వాణిజ్యం జరిగినట్టు ఈయూ గణాంకాల శాఖ వెల్లడించింది. అమెరికా నుంచి యూరప్‌కు అత్యధికంగా క్రూడాయిల్, ఫార్మాస్యూటికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటోమొబైల్స్, మెడికల్, డయగ్నిస్టిక్ పరికరాలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే యూరోపియన్ దేశాల నుంచి అమెరికాకు ఫార్మాస్యూటికల్స్, కార్లు, ఎయిర్‌క్రాఫ్ట్, కెమికల్స్, మెడికల్ పరికరాలు, వైన్, స్పిరిట్ అవుతున్నాయి.