Indian Pharma | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : దేశీయ ఫార్మా రంగానికి కష్టకాలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫార్మా సంస్థలపై పిడుగుపడినట్లు అయింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సెమికండక్టర్లు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 25 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పన్ను వేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా జనరిక్ ఔషధ మార్కెట్‌పై ఆధారపడివున్న దేశీయ ఫార్మా సంస్థలకు ఇది చేదువార్త. 2024లో భారత్ నుంచి అమెరికాకు 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 31 శాతంగా ఉన్నది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడి మార్కెట్లో విక్రయించనున్న జనరిక్ ఔషధ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నది. దీంతో అమెరికన్లు దేశీయ జనరిక్ ఔషధాల కొనుగోలు తగ్గించి, అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. యూఎస్‌లో వినియోగిస్తున్న జనరిక్ ఔషధాల్లో సగం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే కావడం విశేషం. దీంతో ఏటా అమెరికా 408 బిలియన్ డాలర్ల ఆదా అవుతున్నది.
టారిఫ్‌ల దెబ్బతో సన్‌ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బయోకాన్ వంటి సంస్థలు భారీగా నష్టపోనున్నాయి. 2024లో సన్‌ఫార్మాకు వచ్చిన మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి 32 శాతం సమకూరింది. ఈ టారిఫ్‌లపై కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ..అదనపు సుంకాలు విధించడంతో సంస్థపై పడనున్న భారాన్ని వినియోగదారులపై మోపనున్నట్లు చెప్పారు. ఫార్మా ఉత్పత్తుల ధరలు పెంచకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ ఫార్మా సంస్థలతోపాటు కొనుగోలుదారులపై కూడా పడనున్నదన్నమాట. 100 దేశాలకు తన ఔషధాలను ఎగుమతి చేస్తున్న సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంలో వీటి వాటా 72.7 శాతంగా ఉండటం విశేషం. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు వచ్చిన ఆదాయంలో 47 శాతం ఉత్తర అమెరికా నుంచి సమకూరుతున్నది. వీటిలో ఆంకాలజీ, ఇమ్యునాలజీ థెరపీకి సంబంధించిన జనరిక్ ఔషధాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. దేశంలో మూడో అతిపెద్ద ఔషధ సంస్థ సిప్లా ఆదాయంలో 30 శాతం ఉత్తర అమెరికా నుంచి సమకూరుతున్నది.