ముంబై, మార్చి 13: రిటైల్ మదుపరులు సత్వర లాభాలను ఆశిస్తూ రిస్క్‌తో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌వైపు పరుగులు పెట్టడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు. బుధవారం ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, ఎన్ఐఎస్ఎం సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సుకు నాగేశ్వరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షార్ట్ టర్మిజం అటు నిలకడైన క్యాపిటల్ మార్కెట్లకు, ఇటు స్థిరమైన దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదమేనని వ్యాఖ్యానించారు.
రిస్క్‌లతో కూడిన ఎఫ్అండ్వోల్లో పెట్టుబడులు 90%నష్టాలబారిన పడుతున్నాయని సెబీ అధ్యయనాల్లో తేలినా.. చిన్న మదుపరులు వాటి వెంటే పడుతున్నారని నాగేశ్వరన్ అన్నారు. స్వల్పకాలిక ఇన్వెస్ట్మెంట్ల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులే శ్రేయస్కరమని చెప్పారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లు ఇవేవీ తెలియక ముందుకెళ్లి మళ్లీ మళ్లీ నష్టాలకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా లాభాలను అందిపుచ్చుకోవాలనే అత్యాశే దీని వెనుక ఉందన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 7 శాతంగా ఉండొచ్చన్న ఆశాభావాన్ని నాగేశ్వరన్ కనబర్చారు. అలాగే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మూలధన అవసరాలతో నిమిత్తం లేకుండా బ్యాంకులను ప్రమోట్ చేయడానికి కార్పొరేట్ గ్రూపులకు అనుమతివ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అవసరమైన నిధులను బ్యాంకులు సరిపడా ఉంచుకోవాలని సూచించారు. మూలధనం అవసరమైతే తప్ప బ్యాంకింగ్ యాజమాన్యాల్లోకి కార్పొరేట్లను రానివ్వొద్దనీ అన్నారు.