Growth Rate | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ ప్రగతి 6.4 శాతానికే పరిమితం కావచ్చని గురువారం పేర్కొన్నది. మునుపటితో పోల్చితే 10 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరానికీ (2024-25) జీడీపీ అంచనాను 6.2 శాతానికే ఆపేసింది. ఇంతకుముందు ఇది 6.3 శాతంగా ఉన్నది. ఇప్పటికే ఇటీవలి ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా దేశ వృద్ధిరేటు అంచనాలకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. ఈసారి 6.7 శాతం కాదు.. 6.5 శాతమేనని చెప్పింది. మూడీస్, ఎస్అండ్పీ మరికొన్నీ ఇదే అభిప్రాయాలిచ్చాయి. దీనికి ఫిచ్ అంచనాలూ తోడవగా, దేశ ఆర్థిక ప్రగతిపై సర్వత్రా ఆందోళనల్ని రేకెత్తిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాల నేపథ్యంలోనే దేశ జీడీపీ అంచనాలను తగ్గిస్తున్నట్టు రేటింగ్ఏజెన్సీలు చెప్తున్నాయి. ఇప్పుడు ఫిచ్ కూడా అదే స్పష్టం చేసింది. అమెరికా-చైనాలు తాడోపేడో తేల్చుకుంటుండగా, ఇతర దేశాలకు మాత్రం 90 రోజుల మినహాయింపుతో ఊరట దక్కిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ ఒక్క దేశం ఇబ్బందుల్లో పడినా.. ఆ ప్రభావం మిగతా దేశాలపైనా ఎంతోకొంత ఉంటుంది. అలాంటిది రెండు అగ్రదేశాలే పరస్పర సుంకాలతో దాడులు చేసుకుంటుండటంతో ఆ సెగ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకూ గట్టిగానే తగులుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికైతే భారత్‌పై నేరుగా సుంకాల పోటు లేకున్నా.. అగ్రరాజ్యంతో ఒప్పందాలు కుదరకపోతే జూలైలో టారిఫ్‌ల దెబ్బ ఖాయమన్న అభిప్రాయాలున్నాయి. పైగా కనీస సుంకాలు ఎటూ ఉండనే ఉంటాయి. ఇవన్నీ కూడా తాజా ఫిచ్ రేటింగ్స్ అంచనాలకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాదికిగాను ప్రపంచ జీడీపీ అంచనానూ 0.4 శాతం దించింది ఫిచ్. చైనా, అమెరికాల వృద్ధినీ 0.5 శాతం మేర పడేసింది మరి.
దేశంలో మందగించిన వినియోగదారుల కొనుగోలు శక్తి కారణంగా కీలక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా తయారీ రంగం పేలవ ప్రదర్శననే చేస్తున్నది. ఫిబ్రవరిలో 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 2.9 శాతంగానే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) నమోదైంది. గతంతో పోల్చితే ఉత్పాదక రంగ కార్యకలాపాలు 2 శాతం పడిపోయినట్టు తేలింది.
గనులు, విద్యుదుత్పత్తి రంగాలూ నిరాశపర్చాయి. ఈ నేపథ్యంలో ఫార్మా, టెక్స్టైల్, స్టీల్, కెమికల్స్ తదితర రంగాలను ట్రంప్ టారిఫ్‌ల భయాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఆశించిన డిమాండ్ లేక మార్కెట్లో నిస్తేజం ఆవరించింది. ఈ సమయంలో ఎగుమతులు కూడా ప్రమాదంలో పడేలా అమెరికా తీరుంటున్నది. మొత్తానికి రాబోయే రోజుల్లో అమెరికా సృష్టించిన టారిఫ్ వార్.. మాంద్యం ముప్పును తెస్తుందా? అన్న అనుమానాలైతే బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకొని మునుపటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ఎకానమీలపై ట్రంప్ రూపంలో పిడుగు పడ్డైట్టెంది.