Car Sales | హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్ నుంచి పోటీ వస్తున్నా, ఇప్పటికీ దేశంలో కార్ల విక్రయంలో మారుతి సుజుకిదే పై చేయిగా ఉంది. గత నెలలో జరిగిన టాప్-10 కార్ల సేల్స్‌లో ఏడు మారుతి సుజుకి మోడల్ కార్లు చోటు దక్కించుకున్నాయి. గతంలో పాపులారిటీ సంపాదించుకున్న టాటా మోటార్స్ నెక్సాన్, పంచ్ మోడల్ కార్లను పక్కకు నెట్టేసి మారుతి సుజుకి గ్రాండ్ విటారా ముందుకు వచ్చింది. గతంలో కార్ల ప్రియులను ఆకట్టుకున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా టాప్-10 జాబితా బయటికి వచ్చేసింది. హ్యుండాయ్ క్రెటా, టాటా మోటార్స్ నెక్సాన్, పంచ్ మినహా టాప్-10 మోడల్ కార్లలో మారుతి సుజుకిదే హవా.
గతేడాది మార్చిలో ఐదో స్థానానికి పరిమితమైన మారుతి సుజుకి స్విఫ్ట్.. గత నెలలో 28.8 శాతం వృద్ధితో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది టాప్‌లో కొనసాగిన వాగన్-ఆర్ వేరియంట్ కార్ల సేల్స్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయాయి. 2022 మార్చిలో 24,634 వాగన్-ఆర్ కార్లు అమ్ముడైతే, గత నెలలో 17,305 యూనిట్లకే పరిమితమైంది.
గతేడాది పాపులారిటీ సంపాదించుకున్న టాటా నెక్సాన్ 3.17 శాతం, టాటా పంచ్ 3.49 శాతం సేల్స్ పెంచుకున్నాయి. టాప్-10 జాబితాలో నెక్సాన్ ఐదో స్థానానికి, పంచ్ తొమ్మిదో స్థానానికి పడిపోయాయి. 2022 మార్చిలో తొమ్మిదో స్థానం సంపాదించుకున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ స్థానాన్ని గత మార్చిలో టాటా పంచ్ భర్తీచేసింది.
మారుతి సుజుకి ఎస్యూవీ వేరియంట్ బాలెనో గతేడాది 14,520 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 16,168 కార్లు అమ్ముడయ్యాయి. మరో మోడల్ బ్రెజా మోడల్ సేల్స్ 30.45 శాతం వృద్ధి చెందడంతోపాటు టాప్-10లో మూడో స్థానానికి చేరుకున్నది. డిజైర్ మోడల్ కార్ల సేల్స్ 18,623 నుంచి 13,394 యూనిట్లకు పడిపోయాయి. మినీ వ్యాన్ ఎకో విక్రయాలు 30.08 శాతం వృద్ధి చెందాయి. డిజైర్ ఏడో స్థానంలో, ఎకో ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
హ్యుండాయ్ మోటార్స్ క్రెటా గతేడాది మార్చిలో 10,532 కార్లు అమ్ముడైతే ఈ ఏడాది 14,026 యూనిట్ల సేల్స్‌తో ఆరవ స్థానానికి చేరుకున్నది. కియా మోటార్స్ సెల్టోస్, స్కోడా కుషాక్ మోడల్ కార్లతో పోటీ పడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా 10,045 యూనిట్ల సేల్స్‌తో పదో స్థానంలో నిలిచింది.