న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వినియోగదారుల భవిష్యత్ కొనుగోలు నిర్ణయాలను ముందుగానే అంచనా వేసే విధానం మార్కెట్లో కీలకంగా మారనుంది. ప్రజల గత ప్రవర్తన, వెబ్సైట్లో వారి కార్యకలాపాలు, శోధనలు, కొనుగోళ్లు తదితర సమాచారాన్ని గ్రహించడం ద్వారా వారు భవిష్యత్తులో ఏమి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందో కృత్రిమ మేధ అంచనా వేస్తున్నది. ఒక ఉత్పత్తిని విడిచిపెట్టే వినియోగదారునికి తదుపరి ఏ ఉత్పత్తిని సూచించాలో నిర్ణయించడం, ఒక ప్రకటనపై ఆసక్తి తగ్గుతున్న విషయాన్ని ముందుగానే గుర్తించడం తదితర పనులను ఏఐ సునాయాసంగా చేస్తున్నది.
ఈ విధానంతో సంస్థలు తమ ప్రచార కార్యక్రమాలను ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. వినియోగదారుల ప్రవర్తనలోని సంకేతాలను గుర్తించి, వారికి సంబంధిత ప్రకటనలను అందించవచ్చు. మరో ముందడుగు వేసిన కృత్రి మేధ వ్యవస్థలు వినియోగదారుల తరపున ఆన్లైన్ కొనుగోళ్లు చేయడం, సేవలను బుక్ చేయడం, ఒప్పందాలపై చర్చించడం వంటివి నిర్వహించగలుగుతున్నాయి. కృత్రిమ మేధ.. వినియోగదారులు అందించే డిజిటల్ సంకేతాలను విశ్లేషించి వారు భవిష్యత్తులో ఏమి కొనుగోలు చేయనున్నారో గుర్తించగలదని బీసీ వెబ్ వైజ్ క్రియేటివ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ భరద్వాజ్ తెలిపారు.