Best SUV Cars | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ. పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)పైనే మోజు పెంచుకుంటున్నారు. గతంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీసంస్థగా మారుతి సుజుకి కార్లకు గిరాకీ ఉండేది. కానీ, 2022-23లో ఆ పరిస్థితి లేదని గణాంకాలు చెబుతున్నాయి. కార్ల విక్రయాల్లోనూ 2022-23 రికార్డులు నెలకొల్పింది. అత్యధిక కార్ల అమ్మకంతో టాటా నెక్సాన్.. ఎస్‌యూవీల్లో బెస్ట్‌గా నిలిచింది.
2022-23లో కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీల వాటా 51.5 శాతం. 2018-19 తర్వాత ఇదే గరిష్టం. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 33,77,436 కార్లు అమ్ముడైతే, గత ఆర్థిక సంవత్సరంలో 38,89,545 యూనిట్లు సేల్ అయ్యాయి. వాటిల్లో ఎస్‌యూవీలు 16,73,488 యూనిట్లు ఉన్నాయి.
టాప్ ఎస్యూవీ కార్లలో మొదటి రెండు స్థానాలూ టాటా మోటార్స్ కొట్టేసింది. టాటా నెక్సాన్, టాటా పంచ్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా, తర్వాతీ స్థానంలో హ్యుండాయ్ మోటార్స్‌కు చెందిన క్రెటా, వెన్యూ ఉన్నాయి. ఇక కియా మోటార్స్ వారి సెల్టోస్, సొనెట్, మారుతి సుజుకి నుంచి బ్రెజా, మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మూడు మోడల్స్.. బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లు టాప్-10లో నిలిచాయి.
గత ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా టాటా నెక్సాన్ 172138 కార్లు అమ్ముడైతే, హ్యుండాయ్ క్రెటా 1,50,372 కార్లు, మారుతి సుజుకి బ్రెజా 1,45,665 కార్లు సేల్ అయ్యాయి. టాటా పంచ్ కార్లు దేశీయంగా 1,33,819 కార్లు విక్రయిస్తే, హ్యుండాయ్ వెన్యూ 1,20,653 కార్లు అమ్మింది. రోజురోజుకు హ్యుండాయ్ వెన్యూకు పాపులారిటీ పెరుగుతున్నది. తర్వాత స్థానంలో మహీంద్రా బొలెరో 1,00,577 యూనిట్లు విక్రయించింది. ఇక కియా సెల్టోస్ 1,00,132 కార్లు విక్రయించా, సొనెట్ 94,096 యూనిట్లకు పరిమితమైంది. మహీంద్రా స్కార్పియో 76,935, ఎక్స్‌యూవీ700 మోడల్ 66,473 కార్లు అమ్ముడయ్యాయి.