హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) తీపి కబురును అందించింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6 ఎమర్జింగ్ టెక్నాలజీలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నాస్కాంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ప్యూచర్ స్కీల్స్ ఫ్రైమ్ పేరుతో అందించనున్న ఈ శిక్షణకు సంబంధించి నాస్కాం సీఈవో కీర్తి సేథ్, టీటా అంతర్జాతీయ అధ్యక్షులు సందీప్ మక్తల, మౌక్తిక్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీకాంత్‌లు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సందీప్ మక్తల మాట్లాడుతూ… క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, బిగ్‌డాటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ మెనేజ్మెంట్ విభాగాల్లో 10 వేల మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు ఈ కోర్సులో శిక్షణ కోసం 8123123434, 6300368705 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.