హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు తూర్పు వైపునవున్న యాదాద్రి భువనగిరి, సూర్యపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామికవాడల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయ ని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) విజ్ఞప్తి చేసింది. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టిఫ్ నేతలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై దండు మల్కాపూర్ వద్ద ఏర్పాటైన టిఫ్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు వీలైనంత త్వరగా ఫ్లైఓవర్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో 1,855 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతం విస్తరించివున్నదని, ఇప్పటికే 552 ఎకరాల్లో టిఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాగా, ఫుడ్ పార్క్, భారత్ పెట్రోలియం బాట్లింగ్ ప్లాంట్, టాయ్స్ పార్క్, ప్లగ్ అండ్ పే పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని వారు మంత్రి కి వివరించారు.
ఈ పార్కుల్లో ఇప్పటికే రూ. 6,675 కోట్ల మేర పెట్టుబడులతో 1,500 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటిద్వారా 80 వేల మందికి ్రఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో టిఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ రెడ్డి, సీనియర్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు, చర్లపల్లి పారిశ్రామిక ప్రాంత ఐలా సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు.