Wagon-R | గతంతో పోలిస్తే కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ స్పేసియస్ కార్లు.. అంటే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) కార్లపై మోజు పెంచుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ కార్ల విక్రయాల్లో సగానికి పైగా ఎస్‌యూవీలదే వాటా. ప్రజల ఆకాంక్షలు, అభిరుచులను పసిగట్టిన కార్ల తయారీ సంస్థలు ఎస్యూవీ కార్ల తయారీపైనే ఫోకస్ చేస్తున్నాయి. గతేడాది (2022) ఏప్రిల్ నుంచి ఈ ఏడాది (2023) మార్చి వరకు దేశీయంగా బుల్లి కార్లు బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలిచాయి. అంతా ఊహించినట్లే మార్కెట్లో మారుతి సుజుకి తన పట్టును గతేడాది కూడా కొనసాగించింది. గత 12 నెలల్లో తన హ్యాచ్ బ్యాక్ వాగన్-ఆర్ కార్లు రెండు లక్షలకు పైగా విక్రయించింది.
గతేడాది టాప్-10 సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి కార్లు ఏడు స్థానాలు సొంతం చేసుకుంటే వాటిలో నాలుగు బుల్లి కార్లే. ఎస్‌యూవీల్లో రెండు టాటా మోటార్స్వే. మొదటి వరుసలో ఉన్న నాలుగు బుల్లి కార్లు మారుతి సుజుకివే. వ్యాగన్-ఆర్ తర్వాత గత 12 నెలల్లో బెస్ట్ సెల్లింగ్ కార్లంటే మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్. గత ఏడాది వ్యాగన్-ఆర్ 2.12 యూనిట్ కార్లు అమ్ముడయ్యాయి. ఇతర కార్ల తయారీసంస్థల మొత్తం కార్ల అమ్మకాల కంటే కూడా వ్యాగన్-ఆర్ సేల్స్ ఎక్కువే.
1999లో దేశీయ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మారుతి సుజుకి మోస్ట్ పాపులర్ మోడల్ కార్లలో వ్యాగన్-ఆర్ ఒకటి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అనుక్షణం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నా రెండు దశాబ్దాలకు పైగా మార్కెట్లో మనుగడ సాగిస్తున్న మోడల్ కార్లలో వ్యాగన్-ఆర్, ఆల్టో నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఇతర కార్ల తయారీ సంస్థలు విడి భాగాల సరఫరాలో సమస్యల వల్ల బుక్ చేసుకున్న కార్ల డెలివరీ పెండింగ్‌లో ఉండటం.. మారుతి సుజుకి స్పేర్‌పార్ట్‌లు అందుబాటులో ఉండటం వల్ల వ్యాగన్-ఆర్ తదితర కార్లకు గిరాకీ పెరగడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
గతేడాది ఫిబ్రవరిలో లేటెస్ట్ అప్డేట్లతో అవతార్ వ్యాగన్-ఆర్ కారు మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్‌తోపాటు సీఎన్జీ వర్షన్లోనూ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.30 లక్షలకే లభ్యం అవుతుంది. ఇక సీఎన్జీ వేరియంట్ కారు ధర రూ.6.44 లక్షలు పలుకుతుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ కారు 1.0 లీటర్ల కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్, 1.2-లీటర్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. సీఎన్జీ వర్షన్ కారు 1.0-లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.