OSM Stream City Qik | అధునాతన టెక్నాలజీ సాయంతో రోజుకో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి వస్తున్నది. కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లతోపాటు త్రీ వీలర్స్- ఆటో రిక్షాల తయారీ సంస్థలు సైతం విద్యుత్ వాహనాల తయారీ వైపు మొగ్గుతున్నాయి. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సాయంతో ఒమెగా సైకీ మొబిలిటీ (ఓఎస్ఎం) అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. 8.8కిలోవాట్ల ప్రొప్రైటరీ బ్యాటరీ ప్యాక్‌తో ఓఎస్ఎం స్ట్రీమ్ కిక్ ఈవీ త్రీ వీలర్ వస్తున్నది. ఎక్స్‌పోనెంట్ రాపిడ్ చార్జింగ్ నెట్ వర్క్ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే నగరంలో 126 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
ఓఎస్ఎం స్ట్రీమ్ సిటీ కిక్ త్రీ వీలర్ మీద ఐదేండ్లు లేదా రెండు లక్షల కి.మీ దూరం వరకూ వారంటీ లభిస్తుంది. 100 శాతం రాపిడ్ చార్జింగ్ మద్దతుతో వస్తున్న బ్యాటరీకి ఎక్స్ పోనెంట్ 3000 సైకిల్ లైఫ్ వారంటీ అందిస్తున్నది. ఈ’ప్యాక్, ఈ-పంప్ అనే ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్, ‘ఈ-ప్లగ్’ అనే చార్జింగ్ కనెక్టర్ సాయంతో 15 నిమిషాల్లో దీనికి 100 శాతం చార్జింగ్ అయ్యేందుకు దోహద పడుతుంది. ఇందుకోసం ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగర పరిధిలో ఈ ఏడాదిలోగా ఎక్స్‌పోనెంట్ 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలకు తన నెట్ వర్క్ విస్తరిస్తుంది.