Apple E-Car | భూతాప నివారణ కోసం ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలన్నీ దృష్టిసారించాయి. ఆటోమొబైల్ సంస్థలతో పాటుగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ కంపెనీలు కూడా విద్యుత్ వాహనాల తయారీపై కేంద్రీకరించాయి. ఇప్పటికే షియోమీ, ఆపిల్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తామని ప్రకటించాయి. నాలుగేండ్లలో 2025లో టెక్ దిగ్గజం ఆపిల్ ఎలక్ట్రిక్ కారును విపణిలో ఆవిష్కరించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. అందుకు ఆపిల్ డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ కారు చిత్రాలు వైరలయ్యాయి.
ఈ కార్ల డిజైన్లను వానరమ అనే కారు లీజింగ్ సంస్థ బయటపెట్టింది. వానరమ ఎఫ్1 కారు మాదిరిగానే ఆపిల్ ఎలక్ట్రిక్ కారు కనిపిస్తున్నది. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్తో అందుబాటులోకి రానున్న ఆపిల్ కార్లలో స్టీరింగ్ వీల్ ఉండకపోవచ్చునని తెలుస్తున్నది. ఇక కారు డోర్లకు హ్యాండిల్స్ ఉండవు. ఈ కారు ఫ్రంట్ డోర్లు ముందు వైపుకు, బ్యాక్ డోర్స్ వెనుకకు తెరుచుకోనున్నాయి. ఎలక్ట్రిక్ కారు కోసం ఆపిల్ దాఖలు చేసిన పేటెంట్లకు అనుగుణంగా తాను బయటపెట్టిన డిజైన్లు ఉండేలా వానరమ చూసుకున్నది. దీనిపై ఆపిల్ యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.