Home Rent Payment | ప్రతి ఒక్కరికి సొంతింటిపై ఆశ ఉన్నా.. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అద్దె ఇండ్లలో ఉండాల్సిందే. అద్దె ఇండ్లలో ఉండేవారు ఆ ఇంటి ఓనర్‌కు అద్దె చెల్లించే విషయంలో సత్సంబంధాలు కొనసాగించాలి. ఒక్కోసారి ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంటారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అద్దెకు ఉండేవారు అద్దెకు దిగినప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అద్దె చెల్లిస్తున్నప్పుడే కొన్ని పద్దతులు పాటించాలి. నోటీసు ఇవ్వకుండా ఇంట్లో అద్దెకు ఉన్న వారిని యజమాని ఖాళీ చేయించలేరు గానీ.. అద్దెకు దిగిన వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం..
ఒక ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి సాధ్యమైనంత వరకు క్యాష్ లెస్.. అంటే డిజిటల్ పేమెంట్స్ విధానంలో అద్దె చెల్లించాలి.. అంటే చెక్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ తదితర నగదు రహిత మోడ్‌లోనే పే చేయడానికి ప్రయత్నించాలి. క్యాష్ లెస్ చానెల్ ద్వారా అద్దె చెల్లిస్తే సదరు ట్రాన్సాక్షన్ రికార్డెడ్ అవుతుంది. రెంట్ పేమెంట్‌కు రుజువుగా మీరు ఆ రికార్డును భద్ర పరుచుకోవడం బెటర్.
ఒకవేళ చెక్ ద్వారా అద్దె పే చేస్తే.. మీ బ్యాంకు ఖాతా, స్టేట్ మెంట్, ఇంటి ఓనర్ పేరు, తేదీ, మొత్తం చెల్లింపు వివరాలన్నీ రికార్డు అవుతాయి. క్రెడిట్ కార్డు లేదా డిజిటల్ పేమెంట్స్ ద్వారా పే చేసినా.. సదరు ఖాతా స్టేట్ మెంట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. కనుక అద్దె చెల్లించలేదనే పేరుతో అర్ధంతరంగా మిమ్మల్ని ఇంటి నుంచి వెంటనే ఖాళీ చేయించలేరు.
కొన్ని సార్లు రెంట్‌కు ఉండేవారికి ఆన్లైన్ పేమెంట్ చేసే ఫెసిలిటీ అందుబాటులో ఉండకపోవచ్చు.. అసలు ఆన్ లైన్ పేమెంట్ విధానం తెలియకపోవచ్చు. చెక్ బుక్ కూడా ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో క్యాష్ రూపంలో అద్దె చెల్లింపునకు మొగ్గు చూపాలి. కొందరు ఇంటి యజమానులు క్యాష్ లెష్ చెల్లింపులను తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. తప్పనిసరి పరిస్థితుల్లో క్యాష్ చెల్లించినట్లయితే రశీదు కావాలని ఇంటి ఓనర్ని కోరవచ్చు. ఒకవేళ యజమాని బ్యాంక్ ఖాతా వివరాలిస్తే ఆ ఖాతాలో క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అద్దె రశీదుతోపాటు బ్యాంక్ డిపాజిట్ స్లిప్ కూడా రికార్డుగా భద్రపరుచుకోవాలి.
గడువు తేదీకి ముందు కొన్ని రోజులు లేదా వారాల ముందు రెంట్ చెల్లించడం వల్ల ఏ నష్టం వాటిల్లదు. తేదీకి ముందే రెంట్ పే చేయడంతో ఇంటి యజమాని సదభిప్రాయంతో ఇల్లు ఖాళీ చేయించే ఆలోచన మానుకోవచ్చు. అయితే ముందస్తు రెంట్ పేమెంట్ తర్వాత యజమాని నుంచి మాత్రం రశీదు పొందడం మరిచిపోవద్దు. ఇంటి ఓనర్‌తో రెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న వ్యక్తితో కాక మరొకరి ఖాతా నుంచి ఓనర్ ఖాతాకు డబ్బు పంపడం సరైన పని కాదు.
ఇంటి యజమాని అర్ధంతరంగా ఇల్లు ఖాళీ చేయించే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే రెంట్ పేమెంట్‌లో జాప్యం ఉండకూడదు. రెంట్ పేమెంట్ తేదీపై ముందుగా మీ మొబైల్ ఫోన్లో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. వేతనం గురించి వేచి చూడకుండా అద్దెకు సరిపడా క్యాష్ మీ ఖాతాలో ముందే భద్ర పరుచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అద్దెకు ఇబ్బందులు ఏర్పడితే బ్యాంకుల్లో స్వల్ప మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వాడుకోవచ్చు.
ముందస్తు నోటీసు లేకుండా, అర్ధంతరంగా రెంట్కున్న వారిని ఇల్లు ఖాళీ చేయించలేరు. 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. చట్టపరమైన తొలగింపులకు కొన్ని కారణాలు ఉంటాయి. వరుసగా రెండు నెలలు అద్దె బకాయి చెల్లించక పోయినా, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఇంటిని ఉపయోగించినా, బిజినెస్ లావాదేవీలకు వాడినా, ఓనర్‌కి తెలియకుండా ఇంటిలో మార్పులు చేర్పులు చేసినా.. మిమ్మల్ని ఇంటి నుంచి ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది. కనుక అద్దెకు ఉంటున్న ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంటి ఓనర్‌తో మంచి అవగాహన కల్పించుకుని, వివాద రహితంగా, పరస్పర అవగాహనతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం మంచిదని చెబుతున్నారు.