LinkedIn Jobs | ఈ ఏడాది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్తోపాటు 15 ఉద్యోగాలకు గిరాకీ ఉంటుందని వరల్డ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ సర్వేలో తేలింది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ తర్వాత రోబోటిక్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్లు, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసేవారు ఎక్కువ కావడంతోపాటు ఇండియన్ ఏవియేషన్ రంగం వృద్ధి దిశగా అడుగులేస్తున్నది. ఈ నేపథ్యలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు గిరాకీ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ ఢిల్లీ, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలో అత్యధికంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ల నియామకాలు జరుగుతాయి.
ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ తర్వాత జాబితాలో రోబోటిక్ టెక్నిషియన్ ఉద్యోగాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఐటీ పరిశ్రమ ఆటోమేషన్ దిశగా పరివర్తన చెందుతున్న నేపథ్యంలో రోబోటిక్ సిస్టమ్స్ బిల్డ్, అసెంబ్లింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ కోసం రోబోటిక్ టెక్నీషియన్లు అవసరం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో క్లయింట్ల మంచీ చెడ్డలను తెలుసుకునేందుకు క్లోజింగ్ మేనేజర్ల ఉద్యోగాలకు మంచి డిమాండే ఉంది.
ఇక బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) టెక్నీషియన్ సుస్టెయినబిలిటీ అనలిస్ట్, బిహేవియరల్ థెరపిస్ట్ ట్రావెల్ స్పెషలిస్ట్, మెకానికల్ ఇంజినీర్ తదితర ఉద్యోగాలకు గిరాకీ బాగానే ఉంది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి 2024 జూలై 31 వరకూ ఉద్యోగాల కోసం లక్షల మంది ఉద్యోగులు, ఉద్యోగార్థుల అభిప్రాయాలను లింక్డ్ ఇన్ పరిశీలించింది. 65 శాతం ఉద్యోగాలు ఈ ఏడాదిలో కొత్తవేనని, గత 25 ఏళ్లలో ఈ ఉద్యోగాలు లేవని 50శాతం మంది అభిప్రాయ పడ్డారని పేర్కొంది. ఈ ఏడాది ప్రతి ఐదుగురిలో నలుగురు కొత్త కొలువు కోసం ఎదురు చూస్తున్నారు.