న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వచ్చే వారంలో జరగనున్న ద్రవ్య విధాన పరపతి సమీక్షలో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచబోదని బ్రోకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నది. మార్చి, ఏప్రిల్ నుంచి ఆర్బీఐ రేట్లను క్రమేపీ పెంచుతుందని, తొలుత రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చన్నది. అటుతర్వాత జూన్‌లో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు అధికం అవుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనాల్లో పేర్కొంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వచ్చే సోమవారం చర్చల్ని పారంభించి, పాలసీ నిర్ణయాన్ని బుధవారం (ఫిబ్రవరి 9) ప్రకటించనున్నది. ద్రవ్యోల్బణంకంటే వృద్ధిపైనే ఆర్బీఐ దృష్టి నిలుపుతుందని, ఈ నేపథ్యంలో వచ్చే సమావేశంలో రేట్లను పెంచకపోవొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. 2020 మే నెల నుంచి కీలక రెపో రేటు 4 శాతం కనిష్ఠస్థాయి వద్దనే నిలిచి ఉంది.