ముంబై, అక్టోబర్ 22: కృత్రిమ మేధస్సు ప్రస్తుతం నిరుద్యోగులకు ఒక వరంలా మారింది. ఈ ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నవారికి భారత్‌తోపాటు విదేశాల్లోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నైపుణ్యం కలిగిన వారిని టెక్నాలజీ సంస్థలతోపాటు ఐటీ కంపెనీలు ఎగరేసుకొని పోతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హైరింగ్ ప్లాట్‌ఫాం సేవలు అందిస్తున్న ఇండీడ్ తన నివేదికలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది.
ఈ నైపుణ్యతతో కూడిన ఉద్యోగ అవకాశాలు గత నెల చివరినాటికి 11.7 శాతానికి ఎగబాకాయని వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో 8.2 శాతంగా ఉన్న అవకాశాలు..మూడు నెలల క్రితం వరకు 10.6 శాతంగా నమోదయ్యాయి. నూతన టెక్నాలజీ సేవలను అందిపుచ్చుకోవడంలో భాగంగా దేశీయ ఐటీ సంస్థలు ఈ ఏఐ నైపుణ్యం కలిగిన వారికి పెద్దపీట వేస్తున్నాయని ఏపీఏసీ సీనియర్ ఎకనమిస్ట్ కాల్లమ్ పికేరింగ్ తెలిపారు. భారత్‌తోపాటు సింగపూర్‌లో ఏఐ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సంబంధిత పోస్టులకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. రంగాలవారీగా చూస్తే డాటా అండ్ అనలిస్ట్‌కు సంబంధించి 39 శాతం ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ స్కిల్స్‌ను వినియోగిస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్(23 శాతం), బీమా(18 శాతం), సైంటిఫిక్ రీసర్చ్(17 శాతం), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(17 శాతం), మెకానికల్ ఇంజినీరింగ్(11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్(9.2 శాతం) వినియోగిస్తున్నారు.
తగ్గిన నియామకాలు
భారత్‌లో క్రమంగా ఉద్యోగ నియామకాలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన రిక్రూట్మెంట్లు సెప్టెంబర్ నెలలోనూ 0.8 శాతం తగ్గాయని ఇండీడ్ వెల్లడించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారిక పనులు జరుగుతుండటం, కరోనా తర్వాత మందగమనం సమయంలో భారత్‌లో ఉద్యోగ అవకాశాలు మార్కెట్ల కంటే బలంగా ఉండటానికి ఈ పరివర్తన కూడా ఒక కారణమని విశ్లేషించింది.