న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నదా? ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం పడుతున్నదా? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం కావాలంటే ‘అవును’ అనే చెప్పాల్సి వస్తున్నది. ‘పరిస్థితులు ఏం బాగాలేవ్. ఇకపై వ్యాపారం అంత సులువు కాదు. మార్కెట్లో కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రస్తుతం కలవరపెడుతున్నది మరి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పర్యవసానాలపై గురువారం టాటా గ్రూప్‌లోని ఆయా సంస్థలకు చెందిన 30కిపైగా సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లతో ఓ సమీక్ష సమావేశాన్ని చంద్రశేఖరన్ నిర్వహించడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఈ సందర్భంగా మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపట్ల ఆయన ఒకింత ఆందోళనను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న అశాంతి.. భారత్ సహా ఆసియాలోని మెజారిటీ దేశాల ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా రవాణాపరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తున్నది. తాజా సమావేశంలోనూ టాటా సన్స్ చీఫ్ దీన్నే ప్రస్తావించినట్టు టాటాల సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. హెయిర్ పిన్ను దగ్గర్నుంచి ఏరోప్లేన్దాకా, సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు రకరకాల వ్యాపారాలు చేస్తూ.. టాటా గ్రూప్ అన్ని రంగాల్లో విస్తరించిన విషయం తెలిసిందే.
వందకుపైగా దేశాల్లో టాటా సంస్థల కార్యకలాపాలు సాగుతుండగా.. ఈ కంపెనీలతో లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ-ఉపాధి అవకాశాలను పొందుతున్న సంగతీ విదితమే. అయితే యుద్ధం వల్ల ఆయా సంస్థల వ్యాపారావకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ముడి సరుకులు, తయారీ, రవాణా అన్నింటి ఖర్చులు పెరిగిపోతున్నాయని, చివరకు లాభాలకు గండిపడుతుందన్న ఆందోళన చంద్రశేఖరన్ మాటల్లో వ్యక్తమైనట్టు సమాచారం. దేశీయ వ్యాపార, పారిశ్రామిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే టాటా గ్రూప్‌లో ఈ రకమైన గుబులు మొదలైందంటే.. యుద్ధం సెగ భారత్‌కు ఏ స్థాయిలో తగులుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యుద్ధం నేపథ్యంలో దేశీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవచ్చని, సరఫరా ఇబ్బందులతో ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ హెచ్చరించారు. అంతేగాక ఎగిసే ఇంధన ధరలతో వ్యయాలు అమాంతం పెరిగిపోవచ్చని, ముడి సరుకుల కొరత వేధించవచ్చని, రూపాయి మారకం వైపు నుంచి నష్టాలు వాటిల్లవచ్చని కూడా గ్రూప్ పెద్దలకు సంకేతాలిచ్చారు. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
అలాగే సంరక్షణ, నగదు నిర్వహణపై దృష్టి పెట్టాలని.. కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. కాగా, ఈ కష్టకాలంలో ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా నడుచుకోవాలని, వారిపై ఏ రకంగానూ ఒత్తిడి పడకుండా చూసుకోవాలని, ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రశేఖరన్ దిశా-నిర్దేశం చేశారు. ఇక గల్ఫ్ దేశాల్లోని టాటా సంస్థల ఉద్యోగులు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. రవాణాపరంగానేగాక, ఇంకా అనేక రకాలుగా భారత్‌కు సవాల్ విసురుతున్నాయి. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, అందులో మెజారిటీ వాటా గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది. అయితే అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్నారంటూ ఇరాన్ పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్‌లపై దాడులు చేస్తున్నది. ఆయా దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నది. దీంతో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినది తెలిసిందే.
ఆయా రకాల పెట్రోల్, డీజిల్ రేట్లూ ఎగిశాయి. దీనివల్ల రవాణా చార్జీలు ఎగబాకగా.. కిరాణా సరుకుల దగ్గర్నుంచి వంటనూనెలు, ఇతరత్రా అన్నింటి ధరలూ పెరుగుతున్నది చూస్తూనే ఉన్నాం. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బ్యాంక్ రుణాలు భారమైపోతాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలతో డాలర్లకు డిమాండ్ ఏర్పడింది. భారతీయ దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడుతుండగా.. రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు పతనమవుతున్నదీ చూస్తున్నాం.
ఇవన్నీ కూడా దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలుగానే మారుతున్నాయి. యుద్ధం మొదలై ఇప్పటికే నెల రోజులకుపైగా అవుతున్నది. ఎగుమతులు-దిగుమతులన్నీ స్తంభించిపోయే ప్రమాదం నెలకొన్నది. ఇప్పుడప్పుడే ముగిసే సంకేతాలూ కనిపించడం లేదు. దీంతో ఈసారి భారత జీడీపీ గణాంకాల్లో తగ్గుదల ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పెరుగుతున్న ఉత్పాదక వ్యయానికి తగ్గట్టు.. వస్తూత్పత్తుల రేట్లను పెంచితే మార్కెట్లో వాటి అమ్మకాలపై ప్రభావం పడటం ఖాయం. ఇదే జరిగితే అంతిమంగా ఉత్పత్తి క్షీణత, ఉద్యోగుల తొలగింపులేనన్న అంచనాలు మెజారిటీ ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్నాయి. అలా జరుగకుండా ప్రభుత్వాల నుంచి ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు, రాయితీలు అందితే యుద్ధం వల్ల నష్టం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.