క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో భారీగా పెరిగిపోయింది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఏకంగా 70 శాతానికిపైగా ఎగబాకింది. ప్రతీ నెలా లావాదేవీలు లక్ష కోట్ల రూపాయలకుపైగానే నమోదయ్యాయని తాజా గణాంకాల్లో తేలింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: క్రెడిట్ కార్డుల వాడకం దేశంలో భారీగా పెరిగిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి 5 నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోల్చితే లావాదేవీల విలువ ఏకంగా 70.36 శాతం ఎగిసింది. ఈ ఏప్రిల్-ఆగస్టులో క్రెడిట్ కార్డు లావాదేవీలు రూ.5,56,119 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే సమయంలో రూ.3,26,427 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ చెప్తున్నది. ఈసారి ప్రతీ నెలా లావాదేవీలు లక్ష కోట్ల రూపాయలపైనే జరిగినట్టు తేలింది. ఇక కార్డు బేస్ ఆధారంగా కస్టమర్లు 7.8 కోట్లుగా ఉండటం గమనార్హం.
ఏటేటా వృద్ధి దిశగానే..
ఏటేటా క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతూపోతూనే ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) మొత్తంగా రూ.9,71,638 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.6,30,414 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరం క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల్లో రూ.3,80,643 కోట్లు వ్యాపారుల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ల ద్వారానే జరగడం విశేషం. రిటైల్ కొనుగోళ్ల జోరుకు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం డెబిట్ కార్డు లావాదేవీలను క్రెడిట్ కార్డు లావాదేవీలు మించిపోయాయి. డెబిట్ కార్డులపై లావాదేవీలు రూ.7,30,213 కోట్లుగానే ఉన్నాయి. దీంతో రూ.2,41,425 కోట్ల లావాదేవీలు క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా జరిగినైట్టెంది.
ఏటా 38-42 శాతం వడ్డీ
క్రెడిట్ కార్డుల వినియోగదారులపై వడ్డీ భారం భారీగానే ఉంటున్నది. ఏటా దాదాపు 38-42 శాతం పడుతున్నది. అయినప్పటికీ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం గమనార్హం. అయితే ఇదేమంత మంచి సంకేతం కాదని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. తర్వాతి బిల్లింగ్‌కు మీ బ్యాలెన్స్‌ను పెండింగ్‌లో పెడితే మీరు రిస్క్‌లోనే ఉన్నట్టు అంటున్నారు.