కాల్పుల విరమణతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న టెన్షన్ వాతావరణం కూడా ఇప్పటికైతే వీగిపోయినైట్టెంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుందన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల జోష్‌ను సంతరించుకోవచ్చన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. నిజానికి ఈ ఉద్రిక్తతలతో గత వారం చివరి రెండు రోజుల్లోనూ సూచీలు భారీగా నష్టపోయాయి. మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,047.52 పాయింట్లు లేదా 1.30 శాతం పతనమై 79,454.47 వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 338.70 పాయింట్లు లేదా 1.39 శాతం క్షీణించి 24,008 దగ్గర ముగిసింది. కాగా, కాల్పుల విరమణ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య జరిగే తదుపరి చర్చలు కూడా మార్కెట్లకు దిశా-నిర్దేశం చేయవచ్చని పలువురు గుర్తుచేస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్‌కు సంబంధించి జరిగే చర్చలు కూడా కీలకం కానున్నాయి. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,500-24,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.