హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్లాంట్ పెట్టాలని ఫాక్స్‌కాన్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు కోరారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీల ఉత్పత్తుల తయారీదారైన ఫాక్స్‌కాన్ ఉన్నతస్థాయి వర్గాలతో బుధవారం తైవాన్ రాజధాని తైపీలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి నేతృత్వంలోని అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు, ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎఫ్ఐటీ) సీఈవో సిడ్నీ లూలకు పారిశ్రామికంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ పర్యావరణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, నూతన పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా ఎదిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన ఎనిమిదేండ్లలో 40 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 22.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలు, అనుకూలతలపై లోతుగా చర్చించారు. ఇందులోభాగంగానే 2032 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగావకాశాలతో, 150 బిలియన్ డాలర్ల హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టంను రూపొందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నదని వివరించారు. రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఇటీవలే ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో పర్యటించిన సంగతి విదితమే. ఇక్కడి ఎకోసిస్టంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై అధికారులతోనూ చర్చించారు. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్రస్థాయి అధికారుల బృందం తైవాన్‌లో ఫాక్స్‌కాన్ యాజమాన్యంతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, యాపిల్ ఐపాడ్, ఐఫోన్ల తయారీదారుగా ఫాక్స్‌కాన్‌కు పేరున్నది తెలిసిందే. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, అడిషనల్ డైరెక్టర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.