IT | న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో కోటి రూపాయలకుపైగా వార్షిక ఆదాయమున్నవారి సంఖ్య 1.69 లక్షలకు చేరుకున్నది. ఇందులో సగానికిపైగా గడిచిన రెండేండ్లలోనే పెరిగారని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికిగాను 2022-23 మదింపు సంవత్సరానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ వివరాల ప్రకారం దేశంలో ఏటా కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని పొందుతున్నవారు 1,69,890 మంది ఉన్నట్టు తేలింది. 2020-21 మదింపు సంవత్సరంలో ఈ సంఖ్య 81,653గానే ఉన్నది. 2021-22లో ఇది 1,14,446కి పెరగగా, 2022-23లో మరో 55వేలకుపైగా పెరిగినట్టు ఐటీ శాఖ తాజాగా స్పష్టం చేసింది.
ఇదిలావుంటే ఏటా కోటి రూపాయలు, ఆపై సంపాదనకు సంబంధించి వ్యక్తులతోపాటు కంపెనీలు, ట్రస్టులను కూడా కలిపితే 2022-23 మదింపు సంవత్సరంలో 2.69 లక్షలకుపైనే ఐటీ రిటర్నులు వచ్చినట్టు ఐటీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 2022-23 మదింపు సంవత్సరానికి మొత్తం 7.78 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్టు చెప్తున్నారు. 2021-22తో పోల్చితే పెరిగాయి. నాడు 7.14 కోట్ల ఐటీ రిటర్నులు వచ్చాయి. ఇక 2022-23 మదింపు సంవత్సరానికి దాఖలైన ఐటీ రిటర్నుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1.98 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (75.72 లక్షలు), గుజరాత్ (75.62 లక్షలు), రాజస్థాన్ (50.88 లక్షలు) రాష్ర్టాలున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో దాఖలైన ఐటీ రిటర్నులు నిరుడుతో పోల్చితే దాదాపు రెట్టింపు స్థాయిలో ఎగిసి 1.36 కోట్లకుపైగా ఉన్నాయి. అయితే జూలైలో 5.41 కోట్లకుపైగా దాఖలైనట్టు ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా తెలుస్తున్నది.