హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక పరిజ్ఞానంతో పుట్టుకు వస్తున్న స్టార్టప్‌లు స్వల్ప కాలంలోనే ఆకాశమే హద్దుగా యూనికార్న్ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. వారసత్వం గా వస్తున్న భారతీయ వ్యాపార ప్రపంచంలో స్టార్టప్‌లు నూతన శకాన్ని లిఖిస్తున్నాయి. చేతిలో డబ్బులు లేకపోయినా బుర్రలో మంచి ఆలోచన ఉంటేచాలు ఒక చిన్న స్టార్టప్‌గా ప్రస్థానం మొదలు పెట్టి, ప్రపంచంలోని వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు భారతీయ స్టార్టప్‌లు ఎదుగుతున్నాయి. ఆవిషయాన్ని ఔత్సాహికులకు తెలియజేస్తూ , మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నిచ్చేలా టై గ్లోబల్ సమ్మిట్-2022 నిలిచింది.
మూడు రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఐసీసీలో జరిగిన సదస్సుకు దేశం నుంచే కాకుండా విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఔత్సాహిక స్టార్టప్‌ల నిర్వాహకులు వేలాదిగా తరలి వచ్చి, కొత్త వ్యాపార సూత్రాలను తెలుసుకున్నారు. ఔత్సాహికులకు అనుభవజ్ఞులు పాఠాలు చెబుతూ పరస్పర సహకారించుకునేలా మూడు రోజుల్లో 100కు పైగా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలను, నెట్ వర్క్ మీటింగ్‌లను నిర్వహించారు.
ఉత్సాహంగా సాగిన సదస్సు
7వ విడత టై గ్లోబల్ సమ్మిట్ ఎంతో ఉత్తేజంగా జరిగింది. మూడు రోజుల పాటు నిర్వహించిన సమ్మిట్‌లో 60 గంటల్లో లక్ష విలువైన పరస్పర చర్చలు జరిగాయని, ఇవీ వ్యాపార రంగంలో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని టై గ్లోబల్ సమ్మిట్ -2022 వైస్ చైర్మన్ మురళీ బుక్కపట్నం తెలిపారు.
‘ప్రభుత్వాల ప్రోత్సాహం కీలకం’
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌గా ఉన్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో స్టార్టప్‌ల భాగస్వామ్యులుగా చేయడానికి ప్రత్యేక ప్రాజెక్టులను చేపడుతున్నాం. అత్యాధునిక టెక్నాలజీలతో స్టార్టప్‌లను ప్రారంభించినవారికి ప్రభుత్వ శాఖల్లో వాటిని వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నాం’
– ఎంఎస్ రావు, టీ హబ్ సీఈవో
‘అంతా క్లౌడ్ టెక్నాలజీదే’
‘భవిష్యత్ అంతా క్లౌడ్ టెక్నాలజీ రంగానిదే. దేశీయ ఐటీ రంగంలో 2020లో 14 శాతంగా ఉన్న క్లౌడ్ టెక్నాలజీ రంగం వాటా వచ్చే ఏడాదికి 80 శాతానికి పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపారా, ప్రభుత్వ పథకాల నిర్వహణలోనూ రూపొందిస్తున్న సాప్ట్వేర్ అప్లికేషన్‌లన్ని క్లౌడ్ ఆధారిత టెక్నాలజీతోనే నడుస్తున్నాయి’
– రాకేశ్ భరద్వాజ్, ఓలా సీఐవో
ఉత్పత్తి బాగుంటేనే భవిష్యత్తు
స్టార్టప్ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తి బాగుంటే వాటికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో అందరూ వాల్యుయేషన్, గమ్యం వైపు చూస్తున్నారు. కానీ అడుగడుగునా సాగే ప్రయాణంలో ఎదురయ్యే వాటి గురించి ఏమిటన్న విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
– సునీల్ శెట్టి , బాలీవుడ్ నటుడు