ముంబై, అక్టోబర్ 8: దేశవ్యాప్తంగా రిటైల్ ఉద్యోగాలకు డిమాండ్ క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండేండ్లకాలంలో రిటైల్ ఉద్యోగాల కోసం వెతికేవారి సంఖ్య 11.80 శాతం తగ్గినట్లు అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. కరోనా కంటే ముందు మూడేండ్లలో 5.50 శాతం నమోదైన వృద్ధి.. ఆ తర్వాత మూడేండ్లలో 11.80 శాతం తగ్గినట్లు అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఆగస్టు 2020 నుంచి ఆగస్టు 2021 వరకు రిటైల్ ఉద్యోగాల కోసం వెతికేవారు 27.70 శాతం అధికమవగా, ఆ తర్వాత ఏడాదికాలంలో 11.80 శాతం తగ్గినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్, ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడంతో ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్ళకు మొగ్గుచూపారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి స్టోర్ మేనేజర్‌కు 15 శాతం మంది ఆసక్తి చూపగా..రిటైల్ సేల్స్ అసోసియేట్ 14.4 శాతం, క్యాషియర్ 11 శాతం, బ్రాంచ్ మేనేజర్ 9.49 శాతం, లాజిస్టిక్ అసోసియేట్ 9.08 శాతం డిమాండ్ ఉన్నదని పేర్కొంది. దేశవ్యాప్తంగా రిటైల్ రంగ ఉద్యోగ అవకాశాలు కలిగిన నగరాల్లో బెంగళూరు 12.26 శాతం వాటాతో తొలి స్థానంలో ఉండగా, ముంబై 8.2 శాతం, చెన్నై 6.02 శాతం కలిగివున్నాయి.