Luxury EV Cars | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: లగ్జరీ విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)పై భారీగా పన్ను పెంచాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కమిటీ సిఫారసు చేసినట్టు ఓ ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తున్నది.
రూ.20 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు ధర కలిగిన ఈవీలపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని, రూ.41 లక్షలకుపైగా ధర కలిగిన ఈవీలపై 28 శాతం జీఎస్టీ వేయాలని సదరు ప్యానెల్ సూచించినట్టు సమాచారం. అయితే కొత్త జీఎస్టీ విధానంలో 28 శాతం స్లాబును తొలగించాలన్న యోచన ఉండటంతో.. కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తే రూ.41 లక్షలకుపైగా ధర కలిగిన ఈవీలు 40 శాతం స్లాబులోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో దేశీయ మార్కెట్లో టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, బీవైడీ తదితర ఈవీల తయారీ సంస్థల అమ్మకాలు పెద్ద ఎత్తునే ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పైగా ప్రస్తుతం మెజారిటీ కంపెనీల వాహనాలన్నీ భారత్‌లో కంటే విదేశాల్లో తయారై దేశీయ మార్కెట్లోకి దిగుమతి అవుతున్నవే. ఈ క్రమంలో పన్ను పోటు తప్పదన్న అభిప్రాయాలు పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, బుధ, గురువారాల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అవుతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా స్లాబుల తగ్గింపు, ఆయా వస్తూత్పత్తులపై పన్ను రేట్ల సవరణ తదితర కీలక అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవచ్చని చెప్తున్నారు.
ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాటా మోటర్స్ వాటా 40 శాతంగా ఉన్నది. ఆ తర్వాత మహీంద్రా 18 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. బీవైడీ, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ తదితర సంస్థలన్ని ఆ తర్వాత ఉండగా, టెస్లా ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది. నిజానికి అధిక పన్నులు వేస్తున్నారనే ఎలాన్ మస్క్.. భారతీయ మార్కెట్‌కు ఇన్నాళ్లూ టెస్లాను దూరం పెట్టారు. అయితే కేంద్రం నుంచి భరోసా రావడంతో ఎట్టకేలకు ఇక్కడ బుకింగ్స్‌ను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ పెంపు ప్రతిపాదనలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.