న్యూఢిల్లీ, జూన్ 21: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబుల సంఖ్యను తగ్గించాలని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) కేంద్ర ప్రభుత్వానికి, జీఎస్టీ మండలికి శుక్రవారం సూచించింది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం జరుగనున్నది. ఈ క్రమంలోనే జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్దాకా ఉన్న అన్ని సంస్థలకు పెంచాలని కూడా జీటీఆర్ఐ కోరింది.
ప్రస్తుతం ఇది రూ.40 లక్షలుగానే ఉన్నది. పరిమితిని పెంచితే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు లబ్ధి చేకూరుతుందని, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జీటీఆర్ఐ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక రాష్ర్టాలవారీ రిజిస్ట్రేషన్లను దూరం పెట్టాలన్నది. కాగా, శనివారం భేటీలో ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను వేయడంతోపాటు, ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చ జరిగే వీలున్నది.
ప్రస్తుతం ఎరువులపై 5 శాతం జీఎస్టీ పడుతున్నది. సల్ఫ్యూరిక్ యాసిడ్, అమ్మోనియా తదితర ముడి సరకులపై 18 శాతం వర్తిస్తున్నది. జీఎస్టీలో ఇప్పుడు 5, 12, 18, 28 శాతం స్లాబులున్న విషయం తెలిసిందే. మరోవైపు జీఎస్టీ రేటుపై హేతుబద్ధ కమిటీ ఏర్పాటైంది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి కన్వీనర్‌గా నియమితులయ్యారు.