న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశీయ ఆటోరంగ దిగ్గజ సంస్థ టాటా మోటర్స్‌కు నవరాత్రి పర్వదినాల ఉత్సాహం బాగా కలిసొచ్చింది. ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఒక్కరోజే దాదాపు 10వేల యూనిట్లుగా నమోదయ్యాయి మరి. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లు నవరాత్రుల తొలి రోజున 10వేల కార్లను విక్రయించినట్టు మంగళవారం కంపెనీ ప్రకటించింది. దిగొచ్చిన వాహన ధరలకు, పండుగ సమయం కూడా తోడైనట్టు పేర్కొన్నది. అలాగే ప్యాసింజర్ వెహికిల్ డీలర్‌షిప్‌ల్లో 25వేలకుపైగా కస్టమర్ ఎంక్వైరీలు రికాైర్డెనట్టు టాటా మోటర్స్ ఈ సందర్భంగా తెలిపింది.
కస్టమర్లకు జీఎస్టీ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నామని, అందుకే ఈ స్థాయిలో సేల్స్ జరుగుతున్నట్టు టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్ సీసీవో అమిత్ కామత్ తెలిపారు. ఇక నెక్సాన్, పంచ్ మాడళ్లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నదన్నారు. ఈ క్రమంలోనే ఈ పండుగ సీజన్లో రికార్డు సేల్స్ ఖాయమన్న ధీమాను కనబర్చారు. కాగా, సోమవారం మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియాలు సైతం బంపర్ సేల్స్‌ను ప్రకటించాయి.