న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు. మొబైల్ సర్వీసు చార్జీలను 10-27 శాతం వరకు పెంచాయి. దీంతో కస్టమర్లు ఈ మూడు సంస్థలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నూతన కస్టమర్లను ఆకట్టుకోవడంలో ముందువరసలో నిలిచింది.
టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జూలైలో బీఎస్ఎన్ఎల్ను కొత్తగా 29.4 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు చేరారు. కానీ, భారతీ ఎయిర్టెల్ 16.9 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోగా, వొడాఫోన్ ఐడియా 14 లక్షలు, రిలయన్స్ జియో 7.58 లక్షల మందిని కోల్పోయింది.
మొత్తం టెలికం సబ్‌స్ర్కైబర్లు కూడా 120.56 కోట్ల నుంచి 120.51 కోట్లకు తగ్గడం విశేషం. మొబైల్ టారిఫ్‌లను పెంచడంతో ఏపీ సర్కిల్‌తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, ముంబై, కోల్‌కతా, తమిళనాడు, పంజాబ్, యూపీల్లో అత్యధిక మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు తగ్గుముఖం పట్టారు. కానీ, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో మాత్రం బీఎస్ఎన్ఎల్ భారీ స్థాయిలో కస్టమర్లను కోల్పోయింది.