2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. గతంలో దాఖలు చేయబోయి ఆగిపోయిన వారికి, వివిధ కారణాలతో దాఖలు చేయలేని వారికి ఇక ఇదే చివరి గడువు. కనుక ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఐటీఆర్‌ను దాఖలు చేయండి.
ఐటీఆర్ దాఖలుకు సరైన ఐటీఆర్ ఫారం కీలకం. ఒకవేళ సరికాని ఐటీఆర్ ఫారంలో వివరాలను నింపి దాఖలు చేస్తే ఐటీ శాఖ తప్పుడు పత్రాలతో దాఖలు చేశారంటూ నోటీసులు జారీ చేయవచ్చు. అందుకని ఐటీ శాఖ ఐటీఆర్ ఫారంలో ఇచ్చిన నిబంధనలు మొదట పరిశీలించండి. ఒకవేళ ఆదాయం రూ.50 లక్షలకు మించకుండా ఉంటే ఐటీఆర్-1 ఫారంను ఉపయోగించండి. అయితే క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఒకటి కన్నా ఎక్కువ ఇండ్లు ఉన్నప్పుడు, రూ.5 వేలకు మించి వ్యవసాయ ఆదాయం ఉంటే మాత్రం ఈ ఫారం పనికి రాదు.
ప్రాథమిక సమాచారం
పాన్, ఆధార్, టాన్ నంబర్, రెసిడెన్షియల్ స్టేటస్ వంటి ప్రాథమిక వివరాలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలుకు ముందుగా వీటిని ఒకటికి రెండుసార్లు అక్షర దోషాలు లేకుండా చెక్ చేయండి. వీటిలో తప్పులుంటే ఐటీఆర్ దాఖలును ఐటీ శాఖ అంగీకరించకపోవచ్చు. అలాగే ఈ-మెయిల్ ఐడీ, అడ్రస్, మొబైల్ నంబర్ వివరాలను కూడా సరైనవి ఇవ్వండి.
ఆదాయ మార్గాలు
పన్ను చెల్లింపుదారులంతా తమకున్న వివిధ ఆదాయ మార్గాలను ఐటీఆర్ ఫారంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ వంటివి పొం దుపర్చాల్సిందే. ఇక ఈ ఏడాది నుంచే డివిడెండ్ ఆదాయాలూ పన్ను పరిధిలోకే వస్తాయి కనుక వాటినీ ఆదాయ మార్గంగా చూపించాల్సి ఉంటుంది. అలాగే విదేశాల్లోని ఆస్తులు, ఆదాయం, విదేశీ పెన్షన్, స్టాక్ ఆప్షన్స్, విదేశీ బ్యాంకు అకౌంట్లు, డబుల్ ట్యాక్సేషన్ పరిధిలోకి వచ్చే క్లెయిమ్ వంటివి కూడా పొందుపర్చాలి.
ఈ వెరిఫికేషన్
ఐటీఆర్ దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఆధార్ ఓటీపీ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి అనేక మార్గాల ద్వారా ఈ వెరిఫికేషన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే మీ ఐటీఆర్ దాఖలు పూర్తయినట్టుగా ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఆ తర్వాత తప్పుగా దాఖలు చేసినట్టుగా గుర్తిస్తే తిరిగి కొత్త ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి కొంత గడువుతో మరో ప్రక్రియ ఉంటుంది.
ఫారం 26ఏఎస్
ఫారం 26ఏఎస్‌లోని వివరాలకు ఐటీఆర్‌లో పేర్కొన్న వివరాలను కూడా ఒకసారి సరి చూడండి. ఏమాత్రం తేడా ఉన్నా ఐటీ శాఖ కొర్రీలు పెడుతుంది. 26ఏఎస్ ఫారంలోని టీడీఎస్ వివరాలకు, ఆదాయ వివరాలకు పొంతన ఉండేలా చూడండి. ఒకవేళ మీరు ఉద్యోగం మారిపోయి ఉన్నట్టయితే పాత వేతనం, కొత్త వేతనం వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెల్లించిన అదనపు పన్నును ఐటీ శాఖ తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతానే కీలకం.