న్యూఢిల్లీ, మే 13: బంగారం, వెండి దిగుమతులపై బుధవారం కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకం, సెస్సులను పెంచింది. ఏకంగా 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. పొదుపు మంత్రంలో భాగంగా కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు హైదరాబాద్‌లో జరిగిన సభ నుంచి పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. ఢిల్లీకి వెళ్లగానే అందుకు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అది చేసేశారు. ఇప్పటిదాకా విదేశాల నుంచి దేశంలోకి దిగుమతైన బంగారం, వెండిపై 6 శాతం (కనీస కస్టమ్స్ సుంకం 5 శాతం, వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు 1 శాతం) సుంకం పడింది.
ఇకపై 15 శాతం (కనీస కస్టమ్స్ సుంకం 10 శాతం, వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు 5 శాతం) పడుతుంది. దీనికి అదనంగా దిగుమతిదారులు 3 శాతం ఐజీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా సుంకం, సెస్సు, పన్నుల భారం 18.45 శాతానికి చేరిందిప్పుడు. మునుపు ఇది 9.18 శాతంగానే ఉండటం గమనార్హం. ఇదిలావుంటే ప్లాటినంపైనా దిగుమతి సుంకం పెరిగింది. 6.4 శాతం నుంచి 15.4 శాతానికి చేరింది.
దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత ఎక్కువగా ఉంటున్నవి బంగారం దిగుమతులే. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంతో తగ్గిన క్రూడాయిల్ సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలు భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర 73 డాలర్లుగా ఉన్నది. ఇప్పుడది 110 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఏప్రిల్ 30న 4 ఏండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. దేశీయ ఇంధన అవసరాల్లో 87 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి మరి. ఇందులో 46 శాతం యుద్ధం కారణంగా మూతబడిన హోర్ముజ్ జలసంధి ద్వారానే చేరుతున్నాయి. అలాగే 60 శాతం ఎల్పీజీ అవసరాలు దిగుమతులే తీర్చుతున్నాయి. వీటిలో 90 శాతానికిపైగా గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి.
కాగా, ఖరీదెక్కిన క్రూడ్‌తో ఎరువుల కొనుగోళ్లు సైతం భారంగా మారాయి. ఈ తరుణంలో దేశంలోని ఫారెక్స్ రిజర్వులు వేగంగా కరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో ఎక్కువగా చెల్లింపులు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే బంగారం దిగుమతుల్ని తగ్గించుకుంటే అలా మిగిలిన ఫారెక్స్ రిజర్వులను ఇతర చమురు, చమురేతర దిగుమతులకు వినియోగించుకోవచ్చన్నదే కేంద్ర ప్రభుత్వం భావన. అందుకే ఈ సుంకాల పెంపు అని ప్రభుత్వ పెద్దల మాట. అంతేగాక డాలర్‌తో పోల్చితే ఆల్‌టైమ్ గరిష్ఠాలకు దిగజారుతున్న రూపాయి మారకం విలువకు కూడా దన్ను లభిస్తుందని అంటున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు తగ్గే డిమాండ్ రూపీకి లాభిస్తుందన్నది వారి వాదన.
దేశంలోకి దిగుమతయ్యే బంగారం, వెండిపై సుంకాలు భారీగా పెరిగిన నేపథ్యంలో దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ రావచ్చని జీటీఆర్ఐ అంచనా వేస్తున్నది. ఆ దేశంతో భారత్‌కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు కారణం అంటున్నది. ఇతర దేశాలతో పోల్చితే దుబాయ్ నుంచి వచ్చే పసిడి, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకాన్ని తక్కువగా వసూలు చేస్తున్నది. దీంతో ఇప్పుడు 14 శాతమే వర్తించనున్నది. ఈ క్రమంలో అక్కడి నుంచి నగల వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేయవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాత్సవ అంచనా వేస్తున్నారు. ఇక వెండిపై 7-8 శాతం సుంకాలే పడవచ్చన్నారు.
ఇదిలావుంటే కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)ను అదుపు చేయడానికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలనే పెంచనక్కర్లేదని రిటైల్ జ్యుయెల్లర్స్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్.. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, పరిశ్రమలు కుదేలవుతాయన్న ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. దిగుమతి కోటాలను లేదా బంగారం, వెండిపై లైసెన్సింగ్ పరిమితులతో కూడా క్యాడ్‌ను అదుపు చేయవచ్చని చెప్తున్నారు. మరోవైపు స్మగ్లింగ్ పెరిగే వీలుండటంతో ఆ దిశగా రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు నిఘా పెంచుతున్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
దేశంలోని ప్రజల వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉండటంతో దాన్ని బయటకు తెస్తే దిగుమతులపై భారాన్ని తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంటున్నారు. నిజానికి 2015లో ఈ ఉద్దేశంతోనే మోదీ సర్కార్ పసిడి నగదీకరణ పథకాన్ని తెచ్చింది. అయితే దీనికి తగినంత స్పందన లేకపోవడంతో 2025లో ఆపేసింది. అయినప్పటికీ స్వల్ప కాలపరిమితితో బ్యాంకుల ఇష్టప్రకారం కొనసాగించుకొనే వెసులుబాటును కల్పించింది. ఇక ఈ పథకంలో దాదాపు 39,044 కిలోల బంగారాన్ని ప్రజలు, సంస్థలు, మదుపర్లు ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరించినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. డిజిటల్ గోల్డ్‌ను ప్రోత్సహించేలా గతంలోనే సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా కేంద్రం అమలు చేసిన సంగతి విదితమే. అయితే అధిక ధరల నేపథ్యంలో భారంగా మారడంతో ప్రభుత్వం నిరుడు దీన్ని ఆపేసింది.
దిగుమతి సుంకాల పెంపు సెగ.. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలను గట్టిగానే తాకింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి రేటు రూ.8,550 ఎగబాకి రూ.1,65,350 (అన్ని పన్నులు సహా)కి చేరింది. కిలో వెండి విలువ రూ.20,500 పుంజుకొని రూ.2,97, 500 (అన్ని పన్నులు సహా)గా నమోదైందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గి 4,700.86 డాలర్లుగా ఉన్నది. వెండి ధర మాత్రం కొద్దిగా పెరిగి 87.45 డాలర్లుగా ట్రేడైంది. కాగా, హైదరాబాద్ విషయానికొస్తే.. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ ఈ ఒక్కరోజే రూ.7,350 ఎగసి రూ.1,48,500గా ఉన్నది.
ఈ దిగుమతి సుంకాల పెంపుతో దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర దాదాపు రూ.27,000 పెరుగుతుంది. దీంతో స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉన్నది.
-రాజేశ్ రోక్డే, అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి చైర్మన్
సుంకాల పెంపుతో బంగారం, వెండి దిగుమతులు 10-15 శాతం తగ్గవచ్చు. అయితే పెరిగే ధరలతో చేసే చెల్లింపుల్లో మాత్రం ఆ మేరకు తగ్గుదల ఉండకపోవచ్చు.
-సువంకర్ సేన్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో
అధిక దిగుమతి సుంకాలతో స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉన్నది. పైగా రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం పెద్దగా ఉండబోదు.
-ఎగుమతిదారులు
