రూ.34,615 కోట్ల మోసం.. 17 బ్యాంకులను ముంచేసిన DHFL
- బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఫ్రాడ్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు
- కేసు నమోదుచేసిన సీబీఐ
న్యూఢిల్లీ, జూన్ 22: బ్యాంక్‌లను రూ.34,615 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్), దాని ప్రమోటర్లు మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ సీబీఐ నమోదు చేసిన అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ ఇదే. ఈ నెల 20న ఈ కేసు రిజిష్టర్ చేసామని, ఇందుకు సంబంధించి ముంబైలో అమరెల్లీస్ రియాల్టర్స్ అధిపతి సుధాకర్ శెట్టి, మరో 8 మంది బిల్డర్లకు చెందిన 12 ఆవరణల్లో 50 మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించినట్లు బుధవారం సీబీఐ అధికారులు చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేసినట్టు వారు తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు 2010-2018 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని 17 బ్యాంక్‌ల కన్సార్షియం రూ.42,871 కోట్ల రుణ సదుపాయాల్ని కల్పించింది. కపిల్, ధీరజ్ వాద్వాన్‌లు 2019 మే నుంచి రుణ చెల్లింపుల్ని ఎగవేసి, బ్యాంక్‌లను రూ. 34,614 కోట్ల మేర మోసపుచ్చినట్టు యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. వాధ్వాన్లు ఆస్తుల్ని కూడబెట్టేందుకు డీహెచ్ఎఫ్ఎల్ ప్రజా ధనాన్ని మళ్లించి, ఖాతా పుస్తకాల్ని తారుమారు చేసినట్టు ఆడిట్లో వెల్లడైందని ఫిర్యాదులో పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ రుణ ఖాతాల్ని బ్యాంక్‌లు వేరు వేరు సమయాల్లో ఎన్పీఏలుగా ప్రకటిస్తూ వచ్చాయి. వాస్తవానికి డీహెచ్ఎఫ్ఎల్ నిధులు మళ్లిస్తున్నదంటూ మీడియాలో 2019 జనవరిలో వార్తలు వెలువడంతో కంపెనీ ఖాతాపుస్తకాల్ని ఆడిట్ చేయడానికి కేపీఎంజీని బ్యాంక్‌లు నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచివెళ్లకుండా అదే ఏడాది అక్టోబర్‌లో బ్యాంక్‌లు లుక్అవుట్ నోటీసుల్ని జారీచేసాయి.
ఫిర్యాదు వివరాలివి..
- బ్యాంక్‌లిచ్చిన నిధుల్ని అనుబంధ సంస్థలకు, డీహెచ్ఎఫ్ఎల్లోని డైరెక్టర్లు, వ్యక్తులకు మళ్లించినట్టు కేపీఎంజీ ఆడిట్ తేల్చింది.
- డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు సంబంధమున్న 66 సంస్థలు, వ్యక్తులకు రూ.29,100 కోట్లు పంపిణీ జరిగినట్టు ఖాతా పుస్తకాల్లో తేలింది. బ్యాంక్‌ల నుంచి నిధులు వచ్చిన నెలరోజుల్లోపే వీటి పంపిణీ జరిగింది.
- శెట్టికి చెందిన సంస్థల్లో పెట్టుబడుల రూపంలో నిధుల మళ్లించారు.
- వందలాది కోట్ల చెల్లింపులు బ్యాంక్ స్టేట్మెంట్లలో కన్పించలేదు. డీహెచ్ఎఫ్ఎల్ రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులపై విధించిన మారటోరియంకు అర్థం లేకుండా పోయింది.
- డీహెచ్ఎఫ్ఎల్, దాని ప్రమోటర్లు రూ.14,000 కోట్లు ప్రాజెక్ట్ ఫైనాన్స్‌గా పంపిణీ చేయగా, ఖాతా పుస్తకాల్లో దానిని రిటైల్ రుణాలుగా చూపించారు. దీంతో లేని రిటైల్ రుణాల కోసం 1,81,664 తప్పుడు రిటైల్ ఖాతాల్ని తెరిచారు. ఈ ఖాతాల నుంచి రూ.14,095 కోట్ల మొత్తం రావాల్సి ఉంది.
- ‘బాంద్రా బుక్స్’ పేరుతో ప్రత్యేకమైన డాటాబేస్ ద్వారా రుణాలిచ్చి, వాటిని ఇతర పెద్ద ప్రాజెక్ట్ లోన్స్ (ఓఎల్‌పీఎల్)లో విలీనం చేసారు.
- పైన పేర్కొన్న రూ.14,000 కోట్ల లేని రిటైల్ రుణాల్లో రూ.11,000 కోట్లు ఓఎల్పీఎల్కు బదిలీ అయ్యాయి. మరో రూ.3,018 కోట్లు అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలుగా రిటైల్ పోర్ట్‌ఫోలియోలో అట్టిపెట్టారు.
- డీహెచ్ఎఫ్ఎల్ రుణ వాయిదా చెల్లించని సమయంలో కూడా ఆరు నెలల్లో నగదు మిగులులోకి వస్తుందని కపిల్ వాధ్వాన్ చెప్పేవారంటూ యూనియన్ బ్యాంక్ ఆరోపించింది.
- బ్యాంక్‌లకు తప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత 2019 మే నెల నుంచి టెర్మ్ రుణాలపై వడ్డీ చెల్లింపుల్ని ఎగవేసింది.
కస్టడీలోనే వాధ్వాన్లు
మరో ఫ్రాడ్ కేసులో ప్రస్తుతం కపిల్, ధీరజ్ వాధ్వాన్లు ఇరువురూ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు రూ.600 కోట్లు ముడుపులిచ్చి, ఆ బ్యాంక్ నుంచి రుణం పొందిన కేసులో వాధ్వాన్‌లపై గతంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కేసులు పెట్టాయి. రాణా కపూర్ సైతం ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. దివాలాతో ఎన్సీఎల్టీ చెంతనున్న డీహెచ్ఎఫ్ఎల్ను నిరుడు సెప్టెంబర్ నెలలో రూ.34,250 కోట్లకు పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కొనుగోలు చేసింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

