హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘గడువులోగా పరిశ్రమ ఏర్పాటు చేయనందుకుగాను మీకు కేటాయించిన భూమిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి’ అంటూ పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీజీఐఐసీ నోటీసులు జారీచేస్తున్నది. అయితే మౌలిక సదుపాయాలు కల్పించకుండానే భూములు కేటాయించి, తీరా వాటిని రద్దు చేస్తామనడం ఏమిటని వారంతా ప్రశ్నిస్తున్నారిప్పుడు. అయినా అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామనే చెప్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయా కంపెనీల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి కావాల్సిన అన్ని వసతులతో ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేశాకే పరిశ్రమలకు టీజీఐఐసీ భూములు కేటాయించాలి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ముందుగా భూములు విక్రయించి కనీస సౌకర్యాలు కల్పించకుండానే వదిలేస్తున్నారు. మాదారం, వర్గల్, బస్వాపూర్, బండ తిమ్మాపూర్, బండ మైలారం తదితర ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ పార్క్‌ల అభివృద్ధి మొదలైంది. అయితే ప్రభుత్వం మారిన తరువాత మౌలిక సదుపాయాల పనులు నిలిపివేశారు. అప్రోచ్ రహదారులు, అంతర్గత రోడ్లు, విద్యుత్తు సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనాల్లేక సదరు భూములు వెలవెలబోతున్నాయి మరి. దీనిపై టీజీఐఐసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. తాజాగా టీజీఐఐసీ నోటీసులు పంపడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నదిప్పుడు.
టీజీఐఐసీ వద్ద భూములు కొనుగోలు చేసినవారు తాము నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ల్లో భూములు కొనుగోలుచేస్తే టైటిల్ క్లియర్‌గా ఉంటుందని, రుణాలు సులభంగా వస్తాయని, ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వెంటనే మంజూరవుతాయనుకుంటే.. పరిస్థితి మాత్రం భిన్నంగా తయారైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం వద్ద నిధుల్లేకనే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నామని అధికారులు పరోక్షంగా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.