Tesla | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : అమెరికాకు చెందిన ఈవీల సంస్థ టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో తన తొలి షోరూంను ముంబైలో లేదా నూఢిల్లీలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌తోపాటు న్యూఢిల్లీలోని ఏరోసిటీలో అవుట్‌లెట్‌ను తెరిచేయోచనలో సంస్థ ఉన్నది. 2022లో భారత్‌లో అడుగుపెట్టాలని చూసిన సంస్థ..భారత ప్రభుత్వం విధిస్తున్న సుంకాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించి వెనక్కితగ్గింది. మళ్లీ ఇప్పుడు ఇక్కడి మార్కెట్లో అడుగు పెట్టడానికి రెడీ అయింది.
కంపెనీ ఎన్ని మాడళ్లు, ధర ఎంత అనేదానిపై స్పష్టం చేయకపోయినప్పటికీ.. అమెరికాలో ఆయా మాడళ్ల ధర ఆధారంగా ఇక్కడి ధరలను నిర్ణయించే అవకాశం ఉన్నది. ప్రారంభ ధర రూ.21 లక్షలు(25 వేల డాలర్లు) స్థాయిలో ఉంటుందని అంచనా. దీంతోపాటు టెస్లా సైబర్‌ట్రక్ రూ.50.70 లక్షలు, మాడల్ 2 రూ.45 లక్షలు, మాడల్ 3 రూ.60 లక్షలు, మాడల్ వై రూ.70 లక్షలు, మాడల్ ఎస్ రూ.1.50 కోట్లు, మాడల్ ఎక్స్ రూ.2 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా.