Tesla Car Recall | అడ్వాన్స్డ్ ఫీచర్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా కార్ల కంపెనీ పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేసింది. కంపెనీకి చెందిన అన్ని రకాల కార్లకు సంబంధించి టెయిల్ లైట్లలో సమస్యను గుర్తించగా.. అమెరికావ్యాప్తంగా 3.21లక్షల కార్లను రీకాల్ చేసింది. కార్ల టెయిల్ లైట్ల సమస్యలపై వినియోగదారుల నుంచి నిత్యం కంపెనీకి ఫిర్యాదులు వస్తున్నాయి. అక్టోబర్ చివరిలో విదేశీ మార్కెట్లలో విక్రయించిన అనేక కార్లలో టెయిల్ లైట్లు సరిగా పని చేయడం లేదని కంపెనీకి ఫిర్యాదులు వచ్చాయి. కార్లలో టెయిల్ లైట్ లోపభూయిష్టంగా ఉండొచ్చని, లేదంటే కొన్ని కారణాలతో లైట్స్ అడపాదడపా పని చేయకపోవడం జరుగవచ్చని కంపెనీ పేర్కొంది.
కార్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, కంపెనీ రీకాల్ చేసిన కార్లలో 2020 మోడల్ వై ఎస్యూవీ, 2023 మోడల్ 3 సెడాన్ మోడల్స్ ఉన్నాయి. కంపెనీ మొత్తంగా 3,21,628 వాహనాలను రీకాల్ చేసింది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో టెస్లా కార్లకు మంచి గిరాకీ ఉన్నది. అత్యుత్తమ, అధునాతన ఫీచర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మోడల్ ఎస్, ఎక్స్, వై, మోడల్-3 వంటి కార్లు ఉన్నాయి. కార్లలో ఆటో పైలట్ మోడ్, కీలెస్ యాక్సెస్, లగ్జరీ ఇంటీరియర్ అలాగే అద్భుతమైన బ్యాటరీ రేంజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.