న్యూయార్క్ : ట్విట్టర్లో మాస్ లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు రేపిన ఎలన్ మస్క్ టెస్లాలోనూ కొలువుల కోతకు తెగబడ్డాడు. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన టెస్లా ఇప్పటికే ఉద్యోగులకు లేఆఫ్స్‌పై స్పష్టమైన సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. వచ్చే క్వార్టర్లో అంటే 2023 ఆరంభంలో లేఆఫ్స్ ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయని ఎలక్ట్రెక్ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది.
ఇక టెస్లాలో హైరింగ్‌ను నిలిపివేయగా ఇది తాత్కాలికమా లేక దీర్ఘకాలంలో నియామకాలను నిలిపివేస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు. టెస్లా ఇప్పటికే తన ఆటోపైలట్ టీం నుంచి 200 మంది ఉద్యోగులను తొలగించగా ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియా కార్యాలయాన్ని మూసివేసింది. టెస్లా ఇప్పటివరకూ 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
ఆర్ధిక మందగమనం చుట్టుముడుతుండటంతో కంపెనీలో పది శాతం మంది ఉద్యోగులపై వేటు తప్పదని ఎలన్ మస్క్ ప్రకటించిన క్రమంలో టెస్లాలో ఎడాపెడా కొలువుల కోత కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభ భయాలు వెంటాడుతుండటంతోనే మస్క్ టెస్లాలోనూ మాస్ లేఆఫ్స్‌కు తెరలేపారని చెబుతున్నారు. అమెజాన్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలూ పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.