Tesla-Vaibhav Taneja | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు కొత్త ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా భారత సంతతి అమెరికన్ వైభవ్ తనేజా నియమితులయ్యారు. నాలుగేండ్లుగా ఆ పదవిలో ఉన్న జాచరి కిర్కోర్న్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎఫ్ఓగా వైభవ్ తనేజా నియమించారు. ప్రస్తుతం వైభవ్ తనేజా కంపెనీలో అకౌంటింగ్ హెడ్‌గా ఉన్నారు. టెస్లా సీఎఫ్ఓ రాజీనామా వార్త బయటకు రావడంతో ఆ సంస్థ షేర్లు సోమవారం మూడు శాతం నష్టపోయాయి.
కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తూ మాస్టర్ ఆఫ్ కాయిన్ టైటిల్ కల జాచరీ అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలను టెస్లా బయటపెట్టలేదు. 13 ఏండ్లుగా టెస్లాలో జాచరి కిర్కోర్న్ పని చేస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వచ్చే డిసెంబర్ వరకూ కంపెనీలో జాచరి కొనసాగుతారు. టెస్లాలో భాగస్వామిని కావడం తనకు ఒక ప్రత్యేక అనుభవం అని జాచరి కిర్కోర్న్ పేర్కొన్నారు. తాను కంపెనీలో చేరినప్పటి నుంచి అందరితో కలిసి పని చేసినందుకు చాలా గర్వంగా ఉందని తన లింక్డ్ ఇన్ ఖాతాలో రాసుకున్నారు. 2019లో టెస్లా సీఎఫ్ఓగా జాచరి కిర్కోర్న్ను సంస్థ సీఈఓ ఎలన్‌మస్క్ ప్రకటించారు.
టెస్లా కొత్త సీఎఫ్ఓగా నియమితులైన వైభవ్ తనేజాకి అకౌంటింగ్లో 20 ఏండ్ల అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌లో పట్టా అందుకున్నారు. టెస్లా చేరడానికి ముందు టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలికం రంగ కంపెనీల్లో పని చేశారు. 2016లో సోలార్ సిటీ అనే కంపెనీని టెస్లా కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో వైభవ్ తనేజా భాగస్వామి అయ్యారు. రెండేండ్ల క్రితం 2021లో టెస్లా ఇండియా డైరెక్టర్‌గా వైభవ్ తనేజా నియమితులయ్యారు.