Tesla Recalls | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. దాదాపు 16 లక్షల కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని 16.80లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు చైనా మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. స్వల్ప సాంకేతిక లోపమే అందుకు కారణమని పేర్కొంది. సాఫ్ట్వేర్ సహాయంతో లోపాన్ని సవరించనున్నట్లు తెలిపింది. కారు ట్రంక్ లాక్ విషయంలో పలు లోపాలున్నాయని గుర్తించినట్లు కంపెనీ చెప్పింది. ప్రయాణ సమయంలో కారు ట్రంక్ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకునే ప్రమాదం ఉందని చెప్పింది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఉచితంగా లోపాన్ని సవరిస్తామని తెలిపింది.
దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ సహా దేశీయంగా తయారుచేసిన మోడల్ 3, మోడల్ వై కార్లలో సమస్యను గుర్తించినట్లుగా రీకాల్ నోటీసుల్లో వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రిమోట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని స్టేట్ మార్కెట్ రెగ్యులేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 2020 అక్టోబర్ 15 నుంచి 2024 జూలై 17 వరకు తయారైన కార్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని కంపెనీ పేర్కొంది. చైనా టెస్లాకు కీలకమైన మార్కెట్. అమ్మకాలతో పాటు కార్లు సైతం అక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. చైనీస్ ఈవీ తయారీదారుల నుంచి కంపెనీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నది. ధర తగ్గింపు, తక్కువ వడ్డీకి ఫైనాన్స్ ఇస్తున్నప్పటికీ అమ్మకాయి పడిపోయాయి. ఫలితంగా రెండో త్రైమాసికంలో నికర ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.