Margin Trading | స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో తరచూ మార్జిన్ ట్రేడింగ్ మాట వినిపిస్తూ ఉంటుంది. అసలు దీని అర్థమేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇది మీ కోసమే. ఉదాహరణకు మీకు రూ.2 లక్షల విలువైన షేర్లు కొనాలని ఉంది. కానీ మీ దగ్గర అందుకు సరిపడా నగదు లేదు. ఇలాంటప్పుడే మార్జిన్ ట్రేడింగ్.. చిన్న మొత్తాలతో పెద్ద ఎత్తున షేర్లను కొనేందుకు వీలు కల్పిస్తుంది. కనిష్ఠంగా కేవలం రూ.20 వేల (అసలు విలువలో 10 శాతం)తో కూడా రూ.2 లక్షల విలువైన షేర్లను మీ సొంతం చేసుకోవచ్చు. మీరు చెల్లించిన ఆ రూ.20 వేలే మార్జిన్. ఇలా జరిగిన లావాదేవీనే మార్జిన్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఇక ఇక్కడ మిగతా మొత్తాన్ని (రూ.1.80 లక్షలు లేదా 90 శాతం) స్టాక్ బ్రోకర్ చెల్లిస్తారు. దాన్ని ఆ తర్వాత ఇన్వెస్టర్లు వడ్డీతోసహా చెల్లించాల్సి ఉంటుంది.
మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ అంటే?
మార్జిన్ ట్రేడింగ్ నిమిత్తం స్టాక్ బ్రోకర్ దగ్గర తెరిచే ఖాతానే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) అకౌంట్ అంటారు. ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ను ఇన్వెస్టర్లు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాలెన్స్ తగ్గితే సదరు బ్రోకర్ నుంచి మార్జిన్ కాల్ వస్తుంది.
ప్రయోజనాలు: మదుపరుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. చిన్న మొత్తాలతోనే పెద్ద ఎత్తున షేర్లను కొనడం వల్ల ఏమాత్రం లాభాలు వచ్చినా అది మీకు పెద్దగానే ఉంటాయి.
రిస్కులు: మార్జిన్ ట్రేడింగ్‌లో లాభాలకు ఎంతైతే అవకాశాలున్నాయో.. నష్టాలకూ అంతకన్నా ఎక్కువ వీలున్నది. అలాగే ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఎప్పటికీ ఉండాలి. తగ్గితే వెంటనే టాప్-అప్‌తో దాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టాప్-అప్ తీసుకోవడంలో మదుపరి విఫలమైతే.. స్టాక్ బ్రోకర్ ఇన్వెస్టర్ల షేర్లను అమ్మేస్తారు. అది నష్టాన్ని కలుగజేస్తుంది. మీరు తీసుకున్న లోన్‌కు చెల్లించే వడ్డీ.. మీ లాభాలను మింగేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.