హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీవైపు తెలంగాణ చురుగ్గా ముందుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. తమ సర్కారు తీసుకొచ్చిన సౌర విద్యుత్తు పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ స్టోరేజ్ సొల్యూషన్స్ పాలసీలు రాష్ర్టాన్ని హరిత పరిష్కారాలు, హరిత శక్తి వైపు తీసుకుపోతున్నాయని వెల్లడించారు. గురువారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్ యాక్షన్ గ్రూప్ సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు సామర్థ్యం 4.2 గిగావాట్లు ఉన్నదని చెప్పారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ.. దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తులో 10.30 శాతం వాటా కలిగి ఉన్నదని వివరించారు. ఇది గ్రీన్ సొల్యూషన్స్, క్లీన్ ఎనర్జీ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నదని చెప్పారు.
రాబోయే సంవత్సరంలో సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఆరు గిగా వాట్లకు పెరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన అవసరాల కోసం ఓ వైపు సౌర, పవన శక్తి ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే, హరితహారం కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ, పచ్చదనాన్ని (ఫారెస్ట్ కవర్) పెంచుతున్నదని వివరించారు. డ్రోన్ పాలసీని తీసుకురావటం, డ్రోన్లతో సీడ్ బాంబింగ్ చేయించడం, టెక్నాలజీ సాయంతో హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు. కాగా, కర్బన ఉద్గారాల నెట్ జీరో సాధనకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ నొక్కి చెప్పారు.
ప్రపంచం నిర్దేశించుకొన్న నెట్‌జీరో లక్ష్య సాధనకు భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని వెల్లడించారు. ఇందుకోసం పాలసీల రూపకల్పన, అమలు విషయంలో ప్రభుత్వాలు మరింత చురుగ్గా ముందుకు పోవాలని సూచించారు. ఈ రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని, అదే సమయంలో క్లీన్ ఎనర్జీ వనరులను పెంచాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. విద్యారంగంలో మార్పులు చేయడం ద్వారా హరిత పరిష్కారాలపై అవగాహన కల్పించేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సదస్సులో వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె, బంగ్లాదేశ్, మాల్దీవులు, యూఏఈ తదితర దేశాల మంత్రులు, పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు.