హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కొత్త తరం ఇంటర్నెట్ వెబ్ 3.0పై ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ‘శాండ్బ్యాక్స్’ పేరుతో ఒక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శాండ్బాక్స్ పేరుతో ఈ కేంద్రం ద్వారా ఎంపిక చేసిన స్టార్టప్‌లకు ప్రభుత్వపరంగా అవసరమైన డాటాను అందుబాటులో ఉంచుతుంది. వెబ్ 3.0కి సంబంధించిన పలు అంశాలపై పరిశోధనను లోతుగా చేపట్టి, అవసరమైన వారికి అందించనున్నారు. నిపుణులతో నిర్వహించే ఫోరంలలో చర్చించి, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని వాటిని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ముఖ్యంగా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డీఈఎఫ్ఐ), మెటావర్స్, వెబ్ 3.0 రంగాలలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా శాండ్ బాక్స్ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు.