హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన ఫాస్ట్-ఫుడ్ సేవలు అందిస్తున్న మెక్ డొనాల్డ్స్..హైదరాబాద్‌లో అంతర్జాతీయ కార్యాలయాన్ని తెరవబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెక్‌డొనాల్డ్ చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్జిన్సితోపాటు పలువురు కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ గ్లోబల్ ఆఫీస్‌తో 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
సంస్థకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులనుంచి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. దీంతో రైతుల ఆదాయం పెరగనున్నదని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్జిన్సి మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలుండటంతో తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లు ఉన్నాయి.