హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో తెలంగాణకు టాప్-10లో స్థానం దక్కింది. అలాగే ఏషియన్ ఎకో సిస్టమ్ ఇన్ అఫర్డబుల్ టాలెంట్‌లో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. బుధవారం లండన్‌లో జరిగిన టెక్ వీక్‌లో జినోమ్ స్టార్టప్ రూపొందించిన గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్-2022 నివేదిక (జీఎస్‌ఈఆర్)ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ నివేదికగా చెప్పుకునే జీఎస్‌ఈఆర్-2022లో తెలంగాణకు స్థానం దక్కడానికి రాష్ట్ర ప్రభుత్వ కృషే ప్రధాన కారణం.
గత 8 ఏండ్లలో ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా తెచ్చిన పాలసీలు ఇందుకు దోహదం చేశాయి. గ్లోబల్ ర్యాంకింగ్‌లో తెలంగాణ పురోగతికి ఇక్కడి శక్తివంతమైన స్టార్టప్ ఎకో సిస్టమ్ సైతం కలిసొచ్చింది. ప్రధానంగా టీ-హబ్‌తోపాటు టీఎస్ఐసీ, వియ్ హబ్, టాస్క్, రిచ్, టీ-వర్క్, తెలంగాణ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లు, వివిధ రంగాల్లోని ఇంక్యుబేటర్లు కీలకంగా ఉన్నాయి. ఐటీ రంగంలో ఎంతో ప్రగతి సాధించినట్టే.. స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధిలోనూ తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తోంది. దీని ఫలితమే ఈ గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ నివేదికలో తెలంగాణకు ప్రత్యేక స్థానం.
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను తెలంగాణ కలిగి ఉన్నదని టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావు తెలిపారు. టెక్నాలజీ స్టార్టప్‌లే కాకుండా విభిన్న రంగాలు, సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహించే అనుకూల వాతావరణం రాష్ట్రం సొంతమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇలా అన్నిచోట్ల సరికొత్త ఆలోచనలతో వచ్చేవారికి అండగా నిలిచేలా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీ-హబ్ ఏర్పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాల ఔత్సాహికులను విశేషంగా ఆకర్షించిందన్నారు. ఇక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు అంతా ముందుకు వచ్చారని వివరించారు. 2016 నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమలు చేస్తోందని గుర్తుచేశారు.